U19 Asia Cup : శతక్కొట్టిన అమన్.. జపాన్‌ను చిత్తు చేసి యువ భారత్ బోణీ

by Harish |
U19 Asia Cup : శతక్కొట్టిన అమన్.. జపాన్‌ను చిత్తు చేసి యువ భారత్ బోణీ
X

దిశ, స్పోర్ట్స్ : యూఏఈ వేదికగా జరుగుతున్న పురుషుల అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ ఆలస్యంగా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓడిన భారత అండర్-19 జట్టు.. రెండో మ్యాచ్‌లో జపాన్‌పై విజృంభించింది. షార్జా వేదికగా సోమవారం జరిగిన గ్రూపు-ఏ మ్యాచ్‌లో జపాన్‌పై 211 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ మహ్మద్ అమన్(122 నాటౌట్) అజేయ శతకంతో రెచ్చిపోయాడు. ఆయుశ్(54) మెరుపు హాఫ్ సెంచరీ బాదగా.. కార్తీకేయ(57) కూడా అర్ధ శతకంతో రాణించాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జపాన్ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్లు ధాటికి నిర్ణీత ఓవర్లలో 128/8 స్కోరుకే పరిమితమైంది.జపాన్ ఇన్నింగ్స్‌లో హుగో కెల్లీ(50), చార్లెస్ హింజె(35 నాటౌట్) పోరాడగా.. మిగతా వారిలో ఇద్దరు డకౌట్, మరో నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ రాజ్, చేతన్ శర్మ, కార్తీకేయ రెండేసి వికెట్లతో సమిష్టిగా సత్తాచాటారు.

బుధవారం చివరి గ్రూపు మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది. సెమీస్‌కు చేరుకోవాలంటే యూఏఈపై గెలవడం తప్పనిసరి. గ్రూపు ఏలో ఇప్పటికే రెండు విజయాలతో అగ్రస్థానంలో ఉన్న పాక్‌‌ సెమీస్‌‌కు అర్హత సాధించింది. మరో స్థానం కోసం యూఏఈ, భారత్ పోటీపడుతున్నాయి. గెలిచిన జట్టు సెమీస్‌లో అడుగుపెడుతుంది. గ్రూపు నుంచి టాప్-2 జట్లే నాకౌట్ దశకు చేరుకుంటాయి.

Advertisement

Next Story