పెద్దచెరువు కబ్జా.. ఆఫీసర్ల నో యాక్షన్

by Sathputhe Rajesh |
పెద్దచెరువు కబ్జా.. ఆఫీసర్ల నో యాక్షన్
X

భూముల ధరలు పెరగడం, గొట్టపు బావుల సేద్యంతో భూమి కోసం చెరువులనే కబ్జా చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలు, అధికారుల అలసత్వం, అవినీతితో తటాకాలు చిక్కిపోతున్నాయి. నీటి నిల్వ సామర్థ్యం తగ్గి, భూములకు ఒక తడిపెడితే చెరువు నీరు ఖాళీ అవుతోంది. సాగునీటి సంఘాలు లేవు. చెరువులపై అజమాయిషీ లేదు. చెరువు మట్టి తోలకం, గోతులు, ఉపాధి పనుల పేరిట చెరువుల్లో మట్టి బయటకు తొలగి కుచించుకుపోతున్నాయి.

దీనికి తోడు చెరువుల్లో పూడిక తీయకపోవడం, కొద్దిపాటి వర్షాలకే చెరువు నిండి అలుగులు పడుతున్నాయి. ప్రస్తుతం దుబ్బాక మండలం హబ్సీపూర్ ​గ్రామంలో పెద్ద చెరువు సర్వే నంబర్​ 399లో చెరువు విస్తీర్ణం 98.14 ఎకరాల విస్తీర్ణం రికార్డుల్లో ఉండగా, అలాగే కృష్ణ సముద్రం సర్వే నంబర్​150 విస్తీర్ణం ప్రస్తుతం 15.31 ఎకరాల విస్తీర్ణమే ఉంది. ఇలా వందలాది ఎకరాల చెరువు భూములను ఆక్రమిస్తున్నా రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. – దిశ, దుబ్బాక

మెట్ట ప్రాంతమైన మిరుదోడ్డి మండలం ధర్మరాం గ్రామం, దుబ్బాక మండలానికి చెందిన హబ్షీపూర్ గ్రామంలో పెద్ద చెరువు వర్షాధార చెరువులు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. వర్షం నీటితో ఒక చెరువు నిండితే ఆ చెరువు నీరు దిగువ చెరువులకు వెళుతుంది. నాటి చెరువుల నిర్మాణం రైతులకు వరమైనప్పటికీ ఆక్రమణలతో నీటి సామర్ధ్యం తగ్గిపోతోంది. మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు 80 శాతం మేర ఆక్రమించి సాగు చేస్తున్నారు. ఇవి వర్షాధార భూములుగా మారాయి. చెరువులలో నీరు నిల్వ ఉంటే ఆ గ్రామంలో కూడా గొట్టపు బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది. వేసవిలో చెరువు నీరు ఖాళీ అవడంతో బోరు నీరు తగ్గిపోయి బ్లాక్‌ జోన్‌గా మారుతుంటాయి.

దుబ్బాక మండలానికి చెందిన హబ్షీపూర్ గ్రామంలో పెద్ద చెరువు సర్వే నంబర్ 399 గల చెరువు విస్తీర్ణం 98.14 ఎకరాల విస్తీర్ణం రికార్డుల్లో ఉంది. అలాగే కృష్ణ సముద్రం సర్వే నంబర్ 159, దీని విస్తీర్ణం 15.31 ఎకరాలే. ప్రస్తుతం ఈ చెరువుల లోపల సగానికి సగం ఆక్రమించి సాగు చేస్తున్నారు. చెరువులు సర్వే చేసి ఆక్రమణలు తొలగించి, పూడిక తీయిస్తే నీటి సామర్థ్యం పెరిగి గ్రామాల్లో వేసవిలో కూడా నీరు అందుబాటులో ఉంటుందని రైతులు, స్థానికులు భావిస్తున్నారు. నీటి సామర్థ్యం పెరిగితే గొట్టపు బావుల నుంచి సమృద్ధిగా నీరందే అవకాశం ఉంటుంది. సాగునీటి సంఘాలు లేకపోవడంతో కనీసం ప్రశ్నించేవారు లేరు. చెరువులు పూర్తిగా బాగు చేయగలిగితే ఉచిత కరెంటు ఆదా చేయవచ్చు.

అధికారుల పట్టింపు శూన్యం..

హబ్షీపూర్ గ్రామంలో పెద్దచెరువు ఆక్రమణకు గురవుతున్నా దిగువ ఆయకట్టు రైతులకు సమస్య ఏర్పడుతోంది. అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువులు ఆక్రమించి దుర్వినియోగం చేస్తున్నా పట్టించుకోరు. గతంలో ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా ఆక్రమిస్తే సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం అవినీతి, అలసత్వంతో పట్టించుకున్నవారు లేరు. ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే పెద్దచెరువు, కృష్ణ సముద్రాన్ని సర్వే చేసి కబ్జాకు గురి కాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed