జలమండలిలో మళ్లీ ఓటీఎస్..ఈనెల 1 నుంచి 31 వరకు అమలు

by Maddikunta Saikiran |
జలమండలిలో మళ్లీ ఓటీఎస్..ఈనెల 1 నుంచి 31 వరకు అమలు
X

దిశ, సిటీబ్యూరో : జలమండలి వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించేందుకు చక్కటి అవకాశం కల్పించింది. ఇందుకోసం వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్-2024) పథకాన్ని మళ్లీ తీసుకొచ్చింది. విజయదశమి పండగను పురస్కరించుకుని ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. ఈ నెల 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలికంగా బిల్లులు చెల్లించకుండా ఉన్న వారికి ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించే అవకాశాన్ని కల్పించింది.

12 లక్షల కనెక్షన్లు..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ పరిధిలో 12 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజు 475 ఎంజీడీల నీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి తరలించి, శుద్ధి చేసిన నీటిని జలమండలి ఇంటింటికి అందజేస్తోంది. ప్రతి కిలోలీటర్ నీటిని తరలించి, శుద్ధిచేయడానికి రూ.47 ఖర్చు చేస్తుండగా, జలమండలి మాత్రం మూడు నుంచి రూ.10 లకు వినియోగదారులకు అందిస్తోంది. ఎంతో విలువైన నీళ్లను వినియోగించాల్సిన బాధ్యత నగరవాసులపై ఉండగా, ప్రధానంగా నీటి సరఫరా వ్యవస్థ లోపాలు, వినియోగదారుల అవగాహన లేమి, అక్రమ నల్లా కనెక్షన్ల రూపంలో నీరు వృథాగా పోతుంది.

అక్టోబర్ ఆఖరు వరకు అమలు..

జలమండలిలో నీటి బకాయిలు పెరిగిపోతుండటంతో వాటిని తగ్గించేందుకు ఓటీఎస్ అమలు చేయాలని వాటర్ బోర్డు ప్రభుత్వానికి గత నెల 19న లేఖ రాసింది. దీనికి స్పందించిన ప్రభుత్వం అనుమతులిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఓటీఎస్ కింద వినియోగదారులు తమ బకాయిలను ఎలాంటి ఆలస్య రుసుం, వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. ఈ పథకం అక్టోబర్ నెలాఖరు వరకు అమలులో ఉంటుంది. జలమండలిలో గతంలో రెండుసార్లు ఈ వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‌ను 2016, 2020లో అమలు చేశారు.

నిబంధనలు..

  • ఓటీఎస్ ఈ నెల 31 వరకు మాత్రమే అమలులో ఉంటుంది.
  • నల్లా కనెక్షన్ యాక్టివ్‌లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
  • గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు ఒకేసారి బిల్లు చెల్లిస్తే ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి.
  • గతంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది.
  • ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వాలి. అంతేకాకుండా బిల్లు చెల్లింపుల విషయంలో వారు విఫలమైతే, ఈ పథకం కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తారు.
  • తమ నల్లా కనెక్షన్ డిస్‌కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే ఇప్పటి దాకా పెండింగ్‌లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

వడ్డీ మాఫీ పరిధి ఇలా..

నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ కోసం అధికారులకు స్థాయిని బట్టి అమౌంట్ పరిధిని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం మేనేజర్ స్థాయిలో రూ.2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10,000 వరకు, జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ.1,00,000 వరకు, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ మాఫీ చేసే అధికారం ఉంది.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జలమండలి ఎండీ అశోక్ రెడ్డి

దీర్ఘకాలికంగా బిల్లులు చెల్లించని వినియోగదారుల కోసం ఈ ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ చివరి అవకాశాన్ని వియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నెలాఖరులోగా పెండింగ్ బకాయిలు చెల్లించి ఆలస్య రుసుం, వడ్డీ నుంచి మినహాయింపు పొందాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed