‘కేసీఆర్ వల్ల కాదు.. గద్దర్ వలనే తెలంగాణ వచ్చింది’

by karthikeya |
‘కేసీఆర్ వల్ల కాదు.. గద్దర్ వలనే తెలంగాణ వచ్చింది’
X

దిశ, అచ్చంపేట/అమ్రాబాద్: ‘‘తుపాకి గొట్టం ద్వారా కాదు.. రాజ్యాంగం ద్వారా, దళిత పీడిత ప్రజానీకానికి అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు ద్వారానే రాజ్యాధికారం దక్కుతుంది’’ ఇవి చివరిసారిగా నల్లమల్ల ప్రాంతంలోని అమ్రాబాద్ మండలంలో గద్దర్ మాట్లాడిన మాటలు. శ్రీశైలం జాతీయ రహదారి మన్ననూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. ప్రముఖ రచయిత కంచ ఐలయ్య, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, దాత కొల్లూరి సత్తయ్య, అంబేద్కర్ ఉద్యమ నేత జేబీ రాజు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గాయని విమలక్క, గాయకుడు ఏపూరి సోమన్న తదితరులు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆవరణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో అంబేద్కర్ జేబీ రాజు మాట్లాడుతూ.. మొదటిసారిగా అంబేద్కర్‌పై బుర్రకథ చెప్పింది గద్దరేనన్నారు. విప్లవ సాహిత్యంలో ఆయనో యుగపురుషుడని కొనియాడారు. గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడుతూ.. గద్దర్ చనిపోలేదని, దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలు నెలకొల్పుతూ గద్దర్ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.

ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్‌ను కేసీఆర్ తన గడిల ముందు 6 గంటలు వెయిట్ చేయించి అవమానపరిచాడని ద్వజమెత్తారు. కేసీఆర్ చాలా భూములు తిన్నాడని, 200 కోట్ల విలువగల బంగ్లా కట్టుకొని గద్దర్ను అవమానపరిచిన దుర్మార్గుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి రక్తంతో తెలంగాణ వచ్చిందో రేపటి తరానికి చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో 10 ఎమ్మెల్యే నియోజకవర్గంలో గద్దర్ విగ్రహాలను కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ఆయన నినాదంతో ముందుకు వెళ్లాలని కోరారు. శరీరంలో 6 తూటాలు దిగినా తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాతనే తాను మరణిస్తానన్న వ్యక్తి గద్దర్ ఒక్కడే అని కొనియాడారు.

వరంగల్ కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి:





గద్దర్‌కు నంది అవార్డును ప్రకటించాలని తాము సూచించిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, అది జీర్ణించుకోలేని కొందరు సినీ ప్రముఖులు వ్యతిరేకించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన చాకలి ఐలమ్మ పేరును యూనివర్సిటీకి ప్రకటించాలని కోరిన వెంటనే సీఎం ప్రకటించి తనగొప్పతనాన్ని చాటుకున్నారన్నారు. ప్రభుత్వం రూ.120 కోట్లతో వరంగల్ పట్టణంలో కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేస్తోందని, ఆ కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ప్రభుత్వానికి కోరారు. గద్దర్ ఆశయం కోసం ఎమ్మెల్యేలు పనిచేయాలని, గద్దర్‌ని ఎవరు విస్మరించినా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

పాట ఉన్నంతకాలం..





గద్దర్ పాట ఉన్నంతకాలం ఆయన ఈ నేలపై బతికే ఉంటారని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఆయన స్ఫూర్తి, ప్రొఫెసర్ ఐలయ్య సూచన మేరకు నియోజకవర్గంలో వీలైనన్ని గద్దర్ విగ్రహాల ఏర్పాటుకు తన పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. ప్రజా కవి గద్దర్ అంటేనే ప్రశ్నించేతత్వం, ఎదిరించి పోరాడేతత్వం అని, అందుకే ఆయన గొప్పతనం భావితరాలకు గుర్తుండేలా హై స్కూల్ స్థాయిలో గద్దర్ జీవిత చరిత్ర పాఠ్యాంశంగా చేర్చేందుకు ప్రభత్వం పని చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులను నల్లమల మురళి, ఏపూరి సోమన్న, జక్క గోపాల్ గద్దర్ పాటలతో సభను ఉర్రూతలిగించారు. గద్దర్ కూతురు వెన్నెల, గద్దర్ విగ్రహ దాత కొల్లూరు సత్తయ్య అమృతమ్మ, డాక్టర్ బాలబోయిన సుదర్శన్, కొల్లూరి భరత్, నిర్వాహకులు నాసరయ్య, దుమర్ల ఎల్ల స్వామి, జక్కగోపాల్, రాంకోటి, మండల పాత్రికేయ సంఘం అధ్యక్షుడు పెరుముల కొండయ్య, కళాకారుడు గాజుల లక్ష్మీనారాయణ, అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, నాయకులు కుండ మల్లికార్జున్, చైర్మన్ మాధవరెడ్డి, స్థానిక నాయకులు నియోజకవర్గంలో పూల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Next Story