రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష

by Y.Nagarani |   ( Updated:2024-10-06 06:05:16.0  )
రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. సోమవారం అమిత్ షా నేతృత్వంలో జరిగే సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి సహాయం అందించే 5 కేంద్రమంత్రిత్వ శాఖలకు చెందిన మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు హోంశాఖ వెల్లడించింది. వారితో పాటు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, సీపీఎఫ్ సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారని తెలిపింది.

ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి రాత్రికే ఢిల్లీ చేరుకోనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండ్రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ లో భారీ మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి సీఎంలతో సమావేశమై.. ఆయా రాష్ట్రాల్లో మావోల కార్యకలాపాలపై చర్చించనున్నట్లు హోంశాఖ స్పష్టం చేసింది. 2010 నుంచి మావోయిస్టుల కార్యకలాపాలను గమనిస్తే.. ఇప్పటి వరకూ 72 శాతం వరకూ వారి హింస తగ్గిందని, మృతుల సంఖ్య కూడా 86 శాతం తగ్గిందని కేంద్రం భావిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 723 మంది మావోయిస్టులు లొంగిపోగా.. సెర్చ్ ఆపరేషన్లో 202 మంది చనిపోయారు. మరో 812 మంది అరెస్టయ్యారు.

Advertisement

Next Story

Most Viewed