Possive Smoking : పాసివ్ స్మోకింగ్ హానికరం.. బాధితుల్లో మహిళలే ఎక్కువ!

by Javid Pasha |   ( Updated:2024-10-06 07:24:32.0  )
Possive Smoking : పాసివ్ స్మోకింగ్ హానికరం.. బాధితుల్లో మహిళలే ఎక్కువ!
X

దిశ, ఫీచర్స్ : పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసిందే. వివిధ క్యాన్సర్లు, సంతానలేమి సమస్యలు, గుండె జబ్బులతో ఇది ముడిపడి ఉంటుంది. అయితే పొగ వారికే కాకుండా వారి కుటుంబ సభ్యులకు, తరచుగా పక్కనుండే వ్యక్తులకు కూడా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీరు స్మోక్ చేస్తున్నప్పుడు వెలువడే పొగను వారు కూడా పీలుస్తారు. దీనినే పాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్ హాండ్ స్మోకింగ్ అంటారు. దీనివల్ల తాగేవారిపై ఎంత ప్రభావం పడుతుందో, దానిని పీల్చే వారిలో అంతకంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తే చాన్సెస్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఏటా 80 లక్షల మరణాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం స్మోకింగ్ లేదా పొగాకు అలవాట్ల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 80 లక్షల మంది మరణిస్తున్నారు. ఇందులో స్వయంగా పొగతాగడం లేదా పొగాకు ఉత్పత్తులను వినియోగించేవారు 70 లక్షల మంది వరకు మృత్యువాత పడుతుండగా.. 10 నుంచి 13 లక్షల మంది వరకు పాసివ్ స్మోకింగ్ వల్ల చనిపోతున్నారు. కాగా పాసివ్ స్మోకింగ్ మరణాల్లో మహిళలే ఎక్కువగా ఉంటున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఎలాంటి సమస్యలు వస్తాయి?

పాసివ్ స్మోకింగ్ వల్ల లంగ్స్ క్యాన్సర్, తీవ్రమైన శ్వాసకోశ సమ్యలు, పక్షవాతం, గుండె జబ్బులు, గొంతు క్యాన్సర్, ఆస్తమా వంటివి వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాగా కుటుంబాల్లో మహిళలే ఎక్కువగా పాసివ్ స్మోకింగ్‌కు గురవుతున్నారు. ఆ ఫ్యామిలీలో పురుషులు సిగరెట్ తాగే అలవాటే ఇందుకు కారణం. అలాగే మహిళల తర్వాత పాసివ్ స్మోకింగ్ ప్రభావం చిన్నారు, వృద్ధులపై ఎక్కువగా ఉంటోంది. ఈ చిన్నారులకు పాసివ్ స్మోకింగ్ చాలా ప్రమాదమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే పొగలోని నికోటిన్ అణువులు వారి ఊపిరితిత్తుల్లోకి చేరడం ద్వారా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీంతో ఆస్తమా, న్యుమోనియా వంటివి తలెత్తవచ్చు.

పరిష్కారం ఏమిటి?

ప్రస్తుతం చాలా మందికి పొగతాగడం హానికరం అని తెలుసు. కానీ పాసివ్ స్మోకింగ్ ప్రాణాంతకమనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. సిగరెట్ తాగుతున్న వ్యక్తి పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, స్నేహితుల్లో ఒకరిద్దరు పొగతాగుతుంటే మిగతా వారు కూడా అక్కడే ఉండి బాతాఖాని వేయడం చివరికి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే విషయం తెలుసుకోవాలి.

స్మోక్ చేసేవారు కూడా అది మానుకోవడం మంచిది. ఒకవేళ పొగ తాగుతుంటే గనుక తమవల్ల ఇతరులు నష్టపోతారని తెలుసుకోగలిగితే నివారణ గురించి ఆలోచిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే కుటుంబంలో ఒక వ్యక్తి పొగతాగడం వల్ల, ఆ కుటుంబంలోని మిగతా సభ్యులు దానిని పీల్చడం కారణంగా క్యాన్సర్లు, గుండె జబ్బులు, ఇతర వ్యాధుల బారిన పడతారు. కాబట్టి ధూమపానం చేసేవారు దానిని మానుకోవడం, అలాగే స్మోక్ చేసేవారి పక్కన ఉండటం కూడా ప్రమాదకరం అని తెలుసుకోవడంనివారణ మార్గాల్లో ఒకటి.

Advertisement

Next Story