మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 24 మంది మృతి

by Rani Yarlagadda |   ( Updated:2024-10-06 07:13:26.0  )
మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 24 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: హెజ్బొల్లా అంతమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ దళాలు(israel army).. తాజాగా సెంట్రల్ గాజాపై విరుచుకుపడ్డాయి. ఓ మసీదుపై దాడి చేయగా.. అక్కడ 24 మంది మరణించారు. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని పాలస్తీనా వైద్యాధికారులు వెల్లడించారు. మరణించినవారంతా పురుషులేనని స్పష్టం చేశారు. సెంట్రల్ గాజాలో డెయిర్ అల్ బలాహ్ పట్టణంలోని అల్ అక్సా అమరవీరుల ఆస్పత్రికి సమీపంలో ఉన్న ఈ మసీదు(mosque attack)లో కొందరు నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్ చేసిన దాడిలో వారే చనిపోయారని అధికారులు తెలిపారు.

మసీదులో ఉన్నవారిలో హమాస్(hamas) కు చెందిన సభ్యులున్నారన్న సమాచారం రావడంతో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లో జరుగుతున్న ఓ మ్యూజిక్ షో పై హమాస్ దాడి చేయడంతో మొదలైన యుద్ధం.. ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఆగలేదు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తాజాగా మరణించిన వారితో కలిపి ఇప్పటి వరకూ 42 వేల మంది ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలేనని పేర్కొంది. పరస్పర దాడులతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు హమాస్.. శనివారం నార్త్ లెబనాన్ లోని బెద్దావి శరణార్థి శిబిరంపై జరిగిన దాడుల్లో హమాస్ అధికారి, అతని భార్య, ఇద్దరు చిన్న కూతుర్లు మరణించినట్లు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed