Jeedimetla Fire Accident : జీడిమెట్ల అగ్నిప్రమాదం.. 27 గంటలైనా అదుపులోకి రాని మంటలు

by M.Rajitha |
Jeedimetla Fire Accident : జీడిమెట్ల అగ్నిప్రమాదం.. 27 గంటలైనా అదుపులోకి రాని మంటలు
X

దిశ, వెబ్ డెస్క్ : మంగళవారం మధ్యాహ్నం జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఎస్‌ఎస్‌వీ పాలిథిన్‌ బ్యాగుల(SSV Polythin Bags) ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగి ఇరవై ఏడు గంటలు గడిచినా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. అగ్నికీలల దాటికి నాలుగంతస్తుల భవనం కుప్పకూలినా, కూలిన శకలాల కింద నుంచి ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చేందుకు నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంటుందని భావిస్తున్నారు. పరిశ్రమలో ఖరీదైన విదేశీ యంత్రాలు, ప్లాస్టిక్ బ్యాగుల తయారీకి ఉపయోగించే రసాయన డ్రమ్ములు భారీగా ఉండడంతో మంటలు ఎంతకీ ఆరడం లేదని అధికారులు వివరించారు. అగ్నికీలలు ఎగిసిపడడంతో చుట్టు పక్కల పరిశ్రమలు పొగబారిపోయాయి. కిలోమీటర్ల మేర దట్టమైన పొగ కనిపిస్తోందంటే పరిస్థితి తీవ్రత అర్ధమవుతోంది. 8 ఫైర్ ఇంజిన్లు, 10 ఫైర్ టీంల సిబ్బంది, 100 వాటర్ ట్యాంకుల నీరు ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. ఒక దశలో బ్రాంటో స్కైలిఫ్ట్‌ వాహనాన్ని కూడా ఉపయోగించినప్పటికీ.. నిల్వ ఉంచిన రసాయనాలు, ఇతర పరికరాలు పెద్ద ఎత్తున పేలడంతో ఫైర్ సిబ్బంది, జనం మొత్తం దూరంగా పరుగులు తీశారు. మొత్తంగా నాలుగంతస్తుల పరిశ్రమ భవనం వెనుక వైపు పూర్తిగా కుప్పకూలిపోయింది. మంటలు అదుపులోకి రావడానికి మరో ఆరు గంటలు పట్టే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed