ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ తీరు మారలేదు: మంత్రి సీతక్క

by karthikeya |
ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ తీరు మారలేదు: మంత్రి సీతక్క
X

దిశ అబ్దుల్లాపూర్మెట్: బీఆర్ఎస్ పార్టీ తమ హయాంలో అభివృద్ధి చేయలేకపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక నిత్యం దుమ్మేత్తిపోస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ వక్ర బుద్ధి మార్చుకోవడం లేదని నిప్పులు చెరిగారు. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత 10 సంవత్సరాలలో రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయని బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు తమ ప్రభుత్వం రైతులకు పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం పాటుపడుతోందని చెప్పిన సీతక్క.. రైతులను ఆదుకోవాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు బోనస్ ఏనాడూ ఇవ్వలేదని, ఇప్పుడు తాము ఇస్తుంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘పేదలకు, రైతులకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీ పథకాలను తీసుకువస్తోంది. ఉచిత బస్సు కూడా సరైంది కాదంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారానికి కొంతమంది మహిళలను ఉసిగొలుపుతున్నారు. ఇష్టం లేకపోతే బస్సులు ఎక్కవద్దు. కానీ నిరుపేదలకు కల్పిస్తున్న ఉచిత బస్ సౌకర్యంపై తప్పుడు ప్రచారాలు చేయకండి. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై విమర్శలు కాకుండా ప్రజలకు ఏదైనా మంచి చేసేందుకు సూచనలు ఇవ్వండి’’ అంటూ హితవు పలికారు.

అనంతరం భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో గడ్డి అన్నారం మార్కెట్ను తరలించిన కొద్ది రోజులకే నెలమట్టం అయిందని అన్నారు. చుట్టూ వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కూడా తన మనుషులకు డబ్బులు రావాలన్న దురుద్దేశంతో పట్టా భూమిని లీజుకు తీసుకొని 70 లక్షల రూపాయలను చెల్లిస్తూ ప్రజాధనం వృధా చేశారని అన్నారు. అలాగే రైతులకు మెరుగైన రైతు మార్కెట్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందని, దానికోసం తమ పూర్తి సహకారం అందజేస్తామని అన్నారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు.

అంతకుముందు గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్‌గా చిలక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా భాస్కరాచారితో పాటు పాలక వర్గంతో మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకునైనా తాను రైతులకు న్యాయం చేస్తానన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు కానీ ఏజెంట్లకు కానీ ప్రజలకు కానీ తన హయాంలో అన్యాయం జరగకుండా నాణ్యమైన సేవలు అందిస్తానని మాటిచ్చారు. అనంతరం ప్రమాణస్వీకారం చేసిన పాలకవర్గాన్ని ప్రముఖులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వం సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, దయానంద్, రోడ్ల అభివృద్ధి శాఖ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి, పెద్ద అంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్ పండుగల జయశ్రీ రాజు, ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, ఏ సి పి కాశిరెడ్డి, సిఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed