ఓపెన్ డిస్కషన్.. క్రాస్ ఎగ్జామినేషన్.. ఈ వారం నుంచి ‘కాళేశ్వరం’ ఎంక్వైరీ స్పీడ్‌అప్

by Rajesh |
ఓపెన్ డిస్కషన్.. క్రాస్ ఎగ్జామినేషన్.. ఈ వారం నుంచి ‘కాళేశ్వరం’ ఎంక్వైరీ స్పీడ్‌అప్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ ఈ వారంలో ఎంక్వయిరీని మరింత ముమ్మరం చేయనున్నది. ఇప్పటికే అధికారుల నుంచి మౌఖికంగా వివరాలను తీసుకుని కొన్ని డాక్యుమెంట్లను స్వీకరించిన కమిషన్.. జూన్ 27 వరకు అఫిడవిట్లను సమర్పించడానికి గడువు ఇచ్చింది. ఆ ప్రకారం దాదాపు 60కు పైగా అఫిడవిట్లు రాగా.. వీటిని పరిశీలించే పనిని ప్రాథమికంగా మొదలు పెట్టింది. జూలై 5 తర్వాత ఎంక్వయిరీపై పూర్తి ఫోకస్ పెట్టనున్నది. దాదాపు రెండు వారాలుగా హైదరాబాద్‌కు దూరంగా ఉన్న జస్టిస్ ఘోష్... ఢిల్లీ, పూణె, రూర్కీలోని నిపుణులతో చర్చించినట్లు తెలిసింది. జూలై ఫస్ట్ వీక్ నుంచి అఫిడవిట్లలోని అంశాలకు అనుగుణంగా ఎంక్వయిరీ షెడ్యూలును ఖరారు చేయనున్నారు. కాగ్ రిపోర్టును కూడా అప్పటికల్లా అధ్యయనం చేసి వారి నుంచి వివరణ తీసుకునే అవకాశమున్నది.

అఫిడవిట్లలోని అంశాలపై ఫోకస్

తొలుత రూపొందించుకున్న ప్లాన్ ప్రకారం అఫిడవిట్లను సమర్పించినవారిని ఓపెన్ డిస్కషన్‌కు ఆహ్వానించి నిపుణుల ద్వారా టెక్నికల్ అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించాలని కమిషన్ భావిస్తున్నది. జూలై 5 వరకు అఫిడవిట్ల పరిశీలన కంప్లీట్ చేసి అందులోని కీలక అంశాలను ఎంపిక చేసుకుని వాటిపైనే ఫోకస్ పెట్టి బీఆర్‌కేఆర్ భవన్‌లోని కాన్ఫరెన్సు హాలులో బహిరంగ ఎంక్వయిరీ జరపాలని భావించింది. అఫిడవిట్లలో కొన్ని వైరుధ్యపూరితమైన టెక్నికల్ అంశాలు ఉన్నందున జస్టిస్ ఘోష్ వాటిపై నిపుణుల నుంచి వివరాలను తెలుసుకోనున్నారు. వాటిపై మాత్రమే క్రాస్ ఎగ్జామినేషన్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. మూడు బ్యారేజీల డిజైన్ టెక్నికల్‌గా సరైన తీరులోనే ఉన్నాయో లేవో వారి అభిప్రాయాలను విన్న తర్వాత వీలైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతో చర్చిస్తారు. నిర్మాణానికి అవసరమైన అనుమతులు, చేయాల్సిన పరీక్షలు జరిగాయో లేదో కూడా నిర్ధారించుకోనున్నారు.

జూలై 5న రాష్ట్రానికి..!

ప్రస్తుతం ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్నందున ఈ నెల 5న రాష్ట్రానికి తిరిగి వచ్చి ఇకపైన ఎంక్వయిరీ ఏ తీరులో నిర్వహించాలో కమిషన్ ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది. రాష్ట్ర ఇరిగేషన్ డిపార్టుమెంటుకు చెందిన ఒక టీమ్ ఇటీవలే రూర్కీ వెళ్లి మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌ గురించి చర్చించింది. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర జల సంఘం ఆమోదించిన ప్రాణహిత డిజైన్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మార్చాల్సి వచ్చిందనే అంశంతో ఎంక్వయిరీని మొదలుపెట్టి ఏ దశలో ఏ అంశంలో ఉల్లంఘన జరిగిందో, ఆ తప్పిదం ప్రభావం ఏ మేరకు ఉన్నదో నిపుణుల అభిప్రాయాలకు అనుగుణంగా కమిషన్ ఒక అంచనాకు రానున్నది. ఇదే సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు డ్యామేజ్ జరగడానికి దారితీసిన పరిస్థితులపై ఎన్డీఎస్ఏతోపాటు పలు కేంద్ర సంస్థలకు చెందిన నిపుణులు కూడా స్టడీ చేసినందున ఆ రిపోర్టులను సైతం అధ్యయనం చేయనున్నది.

టెక్నికల్ అంశాలను కంప్లీట్ చేశాకే..

మొదట టెక్నికల్ అంశాలపై చర్చలను కంప్లీట్ చేస్తే ఆ తర్వాత ఆర్థిక అంశాల లోతుల్లోకి కమిషన్ వెళ్లానుకుంటున్నది. ఇప్పటికే మెయిన్ కాంట్రాక్టులకు బ్యారేజీ నిర్మాణం పనులను ప్రభుత్వం అప్పగించిన తర్వాత అనధికారికంగా సబ్ కాంట్రాక్టుకు ఇచ్చిన వ్యవహారాలపై దృష్టి పెట్టింది. ఆయా సంస్థల బ్యాంకు స్టేట్‌మెంట్ల ఆధారంగా ఎంత మొత్తంలో పనులు బదిలీ అయ్యాయో స్పష్టతకు రానున్నది. ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపునకు దారి తీసిన కారణాలు, అప్పుడు వాటి మధ్య ఉన్న బంధం, కమీషన్ల కోసమే ఇలాంటి ఒప్పందాలు జరిగాయా.. ఇలా తదితర అంశాలపై ఫోకస్ పెట్టనున్నది. మూడు బ్యారేజీలను నిర్మించిన కాంట్రాక్టు కంపెనీల నుంచి ఇప్పటికే మౌఖికంగా వివరాలను సేకరించిన కమిషన్ అఫిడవిట్‌లో ఎలాంటి అంశాలను పొందుపరిచారన్నది ఈ వారం స్టడీ చేయనున్నది.

అవసరమైతే లీడర్లకూ నోటీసులు

బ్యారేజీల నిర్మాణంలో, ఆర్థికంగా జరిగిన అవకతవకల్లో అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టు కంపెనీల ప్రతినిధులే కాకుండా.. అవసరమైతే రాజకీయ నాయకులను కూడా పిలిపించాలని కమిషన్ భావిస్తున్నది. దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరికి నోటీసులు జారీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తొలుత జారీచేసిన జీవో ప్రకారం కమిషన్ తన ఎంక్వయిరీని జూన్ 30కల్లా పూర్తి చేయాల్సి ఉన్నది. కానీ జరుగుతున్న ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని పదవీకాలాన్ని మరో రెండు నెలల పాటు పొడిగించారు. అప్పటికల్లా ఎంక్వయిరీని పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉన్నది. దీంతో రానున్న రెండు నెలల వ్యవధిలో జస్టిస్ పీసీ ఘోష్ ఎంక్వయిరీ మరింత ముమ్మరమవుతుందని, విభిన్నమైన తీరులో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Next Story

Most Viewed