నిఘా త్రినేత్రం.. 185 చెరువుల చుట్టూ సీసీ కెమెరాలు

by Shiva Kumar |
నిఘా త్రినేత్రం.. 185 చెరువుల చుట్టూ సీసీ కెమెరాలు
X

దిశ, సిటీ బ్యూరో: అన్యాక్రాంతమవుతున్న చెరువుల పరిరక్షణకు ఎట్టకేలకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణకు ఇప్పటికే ఈవీడీఎం జవాన్లతో పహారా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ చెరువుల పరిరక్షణతో పాటు ఇతర సేవలను కూడా పారదర్శకతతో అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా తొలుత 6 చెరువుల చుట్టూ ఏర్పాటు చేసిన మొత్తం 93 సీసీ కెమెరాల పహారా సరైన ఫలితాలిస్తుండటంతో మిగిలిన మొత్తం చెరువుల చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది.

ఒక్కో చెరువు చుట్టూ ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫీటీఎల్) కవరయ్యేలా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. చెరువుల సైజును బట్టి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అతిపెద్ద చెరువుగా చెప్పుకునే దుర్గం చెరువు చుట్టూ ఏకంగా 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా చెరువు ఎంట్రెన్స్‌తో పాటు రాకపోకలు సాగించే వారితో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈవీడీఎం జవాన్ల పనితీరును కూడా ఈ సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. దీనికి తోడు కుక్కలకు స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నైపుణ్యత కల్గిన డాక్టర్లచే కాకుండా ఔట్‌సోర్స్ కార్మికులతో చేయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తటంతో కుక్కలకు స్టెరిలైజేషన్ చేసే 6 జోన్లలోని 6 స్టెరిలైజేషన్ సెంటర్లతో పాటు యానిమల్ షెల్టర్లలోని ఆపరేషన్ ధియేటర్లు, క్లీనింగ్ విభాగం, పోస్ట్ ఆపరేటీవ్ వార్డు, ప్రీ ఆపరేటీవ్ వార్డు, క్యాటిల్ షెడ్‌తో పాటు పార్కింగ్ స్థలాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

కేపీహెచ్‌బీ కాలనీలోని శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ జోన్లకు చెందిన స్టెరిలైజేషన్ సెంటర్‌లో, ఎల్బీనగర్ జోన్‌కు సంబంధించి ఫతుల్లాగూడలోని స్టెరిలైజేషన్ సెంటర్‌లో, ఖైరతాబాద్ జోన్‌కు సంబంధించి అంబర్‌పేటలోని స్టెరిలైజేషన్ సెంటర్, కూకట్‌పల్లి జోన్‌కు సంబంధించిన మహాదేవ్‌పురాలోని సెంటర్‌లో, అలాగే చార్మినార్ జోన్‌కు సంబంధించి చుడీబజార్ స్టెరిలైజేషన్ సెంటర్లలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్టెరిలైజేషన్ ఆపరేషన్ తర్వాత మూగజీవాలను అక్కడి సిబ్బంది చూసుకునే తీరును కూడా ఈ సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు జారీచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఎల్బీనగర్ జోన్‌లోని ఫతుల్లాగూడలో మూగజీవాలు మృతి చెందిన ఘటనతో వాటి పరిరక్షణ కోసం ఈ నిఘాను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

కెమెరాలు ఏర్పాటు చేసిన చెరువులు..

జీహెచ్ఎంసీ పరిధిలో అతిపెద్ద చెరువుగా చెప్పుకునే దుర్గం చెరువు చుట్టూ 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, శేరిలింగంపల్లిలోని మల్కంచెరువు చుట్టూ పది, బీహెచ్ఈఎల్ సమీపంలోని నలగండ్ల చెరువు చుట్టూ తొమ్మిది, కూకట్‌పల్లి గంగారం చెరువు చుట్టూ తొమ్మిది, పెద్ద చెరువు చుట్టూ నాలుగు, గౌలిదొడ్డిలోని దోసాయికుంట చెరువు చుట్టూ నాలుగు, మేడికుంట చెరువు చుట్టూ మరో ఆరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ మిగిలిన చెరువు వద్ద కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed