వ్యూహం.. ప్రతి వ్యూహం..! కౌన్సిల్ సమావేశానికి సభ్యులు సన్నద్ధం

by Shiva Kumar |
వ్యూహం.. ప్రతి వ్యూహం..! కౌన్సిల్ సమావేశానికి సభ్యులు సన్నద్ధం
X

దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీ పాలకమండలి ఈ నెల 6న నిర్వహించనున్న సమావేశానికి సంబంధించిన అధికార, విపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లు వ్యూహం, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌కు కౌన్సిల్‌లో కేవలం 12 మంది కార్పొరేటర్లే ఉన్నా, అధికార పార్టీని, అధికారులను పలు అంశాల్లో నిలదీసి ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీల కార్పొరేటర్లు వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి ఇప్పటికే 148 ప్రశ్నలు కార్పొరేటర్ల నుంచి రాగా, కేవలం 25 ప్రశ్నలను మాత్రమే సభలో ప్రస్తావించేందుకు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎంపిక చేసినట్లు సమాచారం.

నిలదీసేందుకు కార్పొరేటర్లు సిద్ధం..

ముఖ్యంగా విపక్షాలకు చెందిన కార్పొరేటర్లు వర్షం సహాయక చర్యలు, కుక్కలు, దోమల బెడద, సీజనల్ వ్యాధులు, జీహెచ్ఎంసీ అప్పులు, ఆర్థిక సంక్షోభంతో పాటు ట్యాక్స్ కలెక్షన్, టౌన్‌ప్లానింగ్ వంటి అంశాలపై అధికారులను నిలదీసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి, నిధుల కేటాయింపుపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పాతబస్తీలోని పలు సమస్యలతో పాటు కార్పొరేటర్ల బడ్జెట్‌పై మజ్లిస్ ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. శానిటేషన్, నాలాల పూడికతీత, దోమల నివారణ వంటి అంశాలపై అధికారుల పనితీరును కౌన్సిల్ సమావేశంలో ఎకరవుపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీనికి తోడు కొందరు బీజేపీ కార్పొరేటర్లు సర్కారు జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన ప్రొఫెషనల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, మ్యుటేషన్, స్టాంప్స్, డ్యూటీ నిధుల కేటాయింపునకు సంబంధించిన ఇప్పటికే ప్రశ్నలు సమర్పించినట్లు తెలిసింది. తమ ప్రశ్నలు కౌన్సిల్‌లో ప్రస్తావించకుంటే నిరసన వ్యక్తం చేయాలని విపక్షాలకు చెందిన కొందరు కార్పొరేటర్లు భావిస్తున్నట్లు సమాచారం.

అధికారుల పనితీరుపై నారాజ్..

ఇతర ప్రభుత్వ శాఖల నుంచి జీహెచ్ఎంసీలోకి డిప్యూటేషన్లపై వచ్చి, గడువు ముగిసినా, సీట్లు వదలని అధికారుల పనితీరుపై అధికార, విపక్షాలకు చెందిన పలువురు కార్పొరేటర్లు గుర్రుతో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఫోన్లు చేసినా, రెస్పాన్స్ కాని అధికారులపై కౌన్సిల్‌లో నిలదీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులు ఫోన్లు చేసినా, రెస్పాన్స్ కాని అధికారుల నుంచి జీహెచ్ఎంసీ ఫోన్లు వెనక్కి తీసుకోవాలని, దీంతో కనీసం జీహెచ్ఎంసీపై సెల్‌ఫోన్ బిల్లుల భారమైన తగ్గుతుందని పలువురు కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో డిమాండ్ చేసే అవకాశం సైతం లేకపోలేదు. దీనికి తోడు గత కౌన్సిల్ సమావేశంలో అడ్వర్‌టైజ్‌మెంట్లు, శానిటేషన్‌లలో జరిగిన పలు అక్రమాలపై విచారణ జరిపేందుకు కార్పొరేటర్లతో నియమించిన కమిటీ విచారణపై పలు విపక్షాలు ప్రశ్నించేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.

Next Story

Most Viewed