ఆ తరహా వార్తలు చదువుతుంటే భయమేస్తోందా?.. కారణం ఇదే..

by Javid Pasha |
ఆ తరహా వార్తలు చదువుతుంటే భయమేస్తోందా?.. కారణం ఇదే..
X

దిశ, ఫీచర్స్ : స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్‌‌లో ‌నచ్చిన వార్తలు చదివేవారి సంఖ్య పెరిగిపోయింది. జస్ట్ వన్ క్లిక్‌తో అవసరమైన సమాచారం కళ్లముందు కనిపిస్తుంది. కాబట్టి చాలామంది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను, సోషల్ మీడియా వేదికలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆధునిక టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ పరంగా ఎంతగా మేలు చేస్తుందో, కొన్ని సందర్భాల్లో దానిని ఉపయోగించుకునే తీరును బట్టి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ముఖ్యంగా క్రైమ్ న్యూస్ మాత్రమే ఎక్కువగా చదవడం, వీడియోలు చూడటం దీర్ఘకాలం కొనసాగించడంవల్ల ఒక విధమైన ఆందోళన, భయం ఏర్పడుతాయని, ఈ పరిస్థితి క్రమంగా రుగ్మతకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.

ఎల్లప్పుడూ ఒకే తరహా సమాచారం లేదా వార్తలకు అడిక్ట్ కావడంవల్ల కొందరు ఇబ్బందులు ఎదుర్కొనే చాన్సెస్ ఉన్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. ప్రధానంగా నెట్‌లో క్రైమ్‌న్యూస్, డాక్యుమెంటరీలు, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ వంటివి చూడటం, నేర పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే చదువుతూ ఉండటం దీర్ఘంకాలంపాటు కొనసాగించేవారు ‘మీన్ వరల్డ్ సిండ్రోమ్’ అనే రుగ్మత బారిన పడే అవకాశం ఉందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

వాస్తవానికి ఈ తరహా బాధితుల మైండ్ సంబంధిత క్రైమ్‌సెన్స్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేయడం, పలు ఇన్సిడెంట్లలో హంతకులు లేదా నిందితుల కదలికలు, వ్యూహాలు, ప్రణాళికలు వంటివి తెలుసుకోవడంవల్ల వీరి మనసు కూడా ఆ తరహా సమాచారానికి అడిక్ట్ అయిపోతుందట. దీంతో తరచుగా వాటిని చూసే వ్యక్తులు తమను తాము డిటెక్టివ్‌గా ఫీల్ అవుతుంటారు. సాధారణ జీవితంలో కూడా ప్రతి విషయాన్నీ నేర పరిశోధనా కోణంలో ఊహించుకోవడం, అనుమానించడం ప్రారంభిస్తారు. ఒక వ్యక్తిలో ఇటువంటి లక్షణాలు కనిపించడాన్నే మీన్ వరల్డ్ సిండ్రోమ్‌గా పేర్కొంటారు.

మీన్ వరల్డ్ సిండ్రోమ్ బాధితులు ఎక్కువగా నేర సంబంధిత సమాచారంతో కనెక్ట్ అయి ఉండటంవల్ల, వారి మనసులో ఆ తరహా ఆలోచనలకే ప్రయారిటీ ఇస్తుంటారు. ఇది రుగ్మత మరింత పెరిగేందుకు కారణం అవుతుందని, వారు సమాజాన్ని చూసే తీరు కాస్త భిన్నంగా మారుతుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రతీ సందర్భంలో భయపడటం లేదా అలర్ట్ అవడం, అనుమానించడం చేస్తుంటారట. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులను కూడా అనుమానించడం, నేరస్థులుగా ముద్రవేయడం చేయవచ్చు.

అంతేకాకుండా బాధితుల్లో క్రమంగా ఆందోళన, భయం పెరిగిపోయి డిప్రెషన్‌కు దారితీయడం, చివరికి కుటుంబంతో కూడా వింతగా ప్రవర్తించడం వంటివి జరగవచ్చు. అయితే బాధిత వ్యక్తుల మానసిక ధోరణి ఒక విధమైన డిజార్డర్ తప్ప ప్రాణాంతక సమస్య కాదని మానసిక నిపుణులు అంటున్నారు. జీవన శైలిలో మార్పులు, నిపుణుల కౌన్సెలింగ్, సైకో థెరపీల ద్వారా మీన్ వరల్డ్ సిండ్రోమ్ తగ్గిపోతుందని చెప్తున్నారు.

* గమనిక: పైసమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించడం లేదు. నిర్ధారణలు, పర్యవసనాలకు ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story