Congress: కాంగ్రెస్‌లో కఠిన నిర్ణయాలు అవసరం.. ఖర్గే ఘాటు వ్యాఖ్యలు

by Mahesh Kanagandla |
Congress: కాంగ్రెస్‌లో కఠిన నిర్ణయాలు అవసరం.. ఖర్గే ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా, జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పేలవప్రదర్శనపై ఢిల్లీలో ఏఐసీసీ కేంద్రకార్యాలయంలో నిర్వహించిన సీడబ్ల్యూసీ(Congress Working Committee) భేటీలో అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పార్టీ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమున్నదని, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎన్నాళ్లు జాతీయ నాయకులు, జాతీయ సమస్యలపై ఆధారపడతారని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని, పార్టీ నాయకులు సమన్వయంతో, సౌభ్రాతృత్వంలో మెలగాలని చెప్పారు. ఐకమత్యంగా మసులుకోవాలని, క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకోవడం పార్టీని తీవ్రంగా నష్టపరుస్తున్నదని, పరస్పర విమర్శలు చేసుకుంటే పార్టీ గెలుస్తుందని ఎలా ఆశిస్తామని పేర్కొన్నారు. క్రమశిక్షణ కోసం ఆయుధమున్నదని, కానీ, పార్టీ నాయకులపై ఇలాంటి నిబంధనలతో స్వేచ్ఛను హరించాలని అనుకోవట్లేదన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపుకోసం పనిచేయాలని, పార్టీ ఓడితే వారూ ఓడినట్టేనని స్పష్టం చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు భుపిందర్ సింగ్, కుమారి సెల్జా మధ్య కోల్డ్ వార్‌ పార్టీని తీవ్రంగా నష్టపరిచిన నేపథ్యంలో అంతర్గత కుమ్ములాటలు వద్దంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన సంస్కరణలు తీసుకురావాలనే సంకేతాలను ఖర్గే స్పష్టంగా ఇచ్చారు. యథావిధిగా ముందుకు సాగితే సత్ఫలితాలు రావని తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకూ సన్నద్ధం కావాలని సుమారు ఐదుగంటలపాటు సాగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు

ఇండియా కూటమి గెలిచినా కాంగ్రెస్ అంతంతే

నాలుగు రాష్ట్రాలకుగాను రెండింటిలో ఇండియా కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, కానీ, అందులో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన అంచనాలను అందుకోలేదని, ఇది భవిష్యత్‌లో మనకు సవాలుగా ఉంటుందని, ఈ ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల నుంచి నేర్చుకోవాలని, వెంటనే లోపాలను సరిదిద్దుకోవాలని పార్టీ నాయకులకు ఖర్గే పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఉన్నదని, కానీ, వాటిని ఓట్లుగా మలుచుకోవడంలో పార్టీ విఫలమవుతున్నదని, ఎక్కడ వెనుకబడుతున్నామో గుర్తించి సరిచేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని, ఓటర్ లిస్టు మొదలు ఓట్ల కౌంటింగ్ వరకు రేయింబవళ్లు జాగరూకతగా ఉండాలని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో పార్టీ ఈ పని చేయడం లేదని, పార్టీని బలోపేతం చేయడం నేటి తక్షణ కర్తవ్యమని పిలుపునిచ్చారు. ఆరు నెలల క్రితం జరిగిన లోక్ సభలో మంచి ఫలితాలు రాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో తారుమారుకావడం రాజకీయ పండితులే చిక్కడం లేదని పేర్కొన్నారు. కాలం మారిందని, ఎన్నికల్లో పోటీ విధానమూ మారిందని, పాత విధానాలు పక్కనపెట్టి ప్రత్యర్థులపై నిత్యం కన్నేసి ఉంచాలని, మైక్రో కమ్యూనికేషన్ స్ట్రాటజీ సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని, ప్రతి నాయకుడూ జవాబుదారీగా ఉండాలని చెప్పారు. ప్రత్యర్థులు చేసే దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసే మార్గాలను అన్వేషించాలని సూచించారు.

ఆ క్రెడిట్ కాంగ్రెస్‌దే

75 ఏళ్ల రాజ్యాంగ దివస్ వేడుకలు జరుపుకుంటున్నామని, ఈ 75 ఏళ్లలో కాంగ్రెస్ కీలక మైలురాళ్లు సాధించిందని ఖర్గే వివరించారు. భారత్ అగ్రశ్రేణిలో ఉన్నదంటే అందుకు రాజ్యాంగమే కారణమని, అలాంటి రాజ్యాంగ రూపకల్పన, అమలు క్రెడిట్ తప్పకుండా కాంగ్రెస్‌దేనని స్పష్టం చేశారు. ఈ 11ఏళ్లలో ప్రజలు ఎంతో నష్టపోయారని, నిరుద్యోగం, ధరాఘాతం, అసమానతలు ప్రజలను పీడిస్తున్నాయని, ఈ ప్రజల బలమైన గొంతుకగా కాంగ్రెస్ మారాల్సి ఉన్నదని వివరించారు. 140 కోట్ల దేశ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరమున్నదని తెలిపారు. సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ సహా పలువురు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రక్రియ గాడి తప్పింది: సీడబ్ల్యూసీ తీర్మానం

స్వేచ్ఛాయుత, పాదర్శకమైన ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విధి అని, కానీ, ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో ఇది కొరవడినట్టు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆరోపించింది. ఎన్నికల ప్రక్రియ గాడి తప్పిందని సీడబ్ల్యూసీ తీర్మానం పేర్కొంది. సమాజంలో చాలా మంది ఈ తీరుపై అసహనంగా ఉన్నారని, ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమరూపంగా తీసుకుంటుందని సీడబ్ల్యూసీ ఈ తీర్మానంలో వివరించింది. ఈవీఎంలు ఎన్నికల ప్రక్రియపై అనుమానాన్ని తెస్తున్నాయని, కానీ, దేశంలో ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటుందని ఖర్గే ఈ భేటీలో వివరించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ కమిటీలు వేస్తుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed