స‌మ‌స్య‌ల సుడిగుండంలో గిరిజన విద్య.. ఏళ్లుగా ప‌ట్టించుకోని ప్ర‌భుత్వాలు

by Anjali |
స‌మ‌స్య‌ల సుడిగుండంలో గిరిజన విద్య.. ఏళ్లుగా ప‌ట్టించుకోని ప్ర‌భుత్వాలు
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: పగిలిన గోడలు.. పాడైన గదులు.. కూర్చోవడానికి స్థలం లేకుండా గుంతలు, వానొస్తే కురిసేలా గదులు.. డోర్లు లేవు.. కిటికీలు కనిపించవు.. ఇవి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలల పరిస్థితి. ఉట్నూర్ ఐటిడీఏ పరిధిలోని ఆ గిరిజన పాఠశాలలను ఏళ్లుగా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వారు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. గిరి విద్య సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్ ఐటిడీఏ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం జిల్లాల్లో మొత్తం 9 వందల గిరిజన ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో చాలా పాఠ‌శాల‌ల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లోని పాఠ‌శాల‌ల‌ను అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో అభివృద్ధి చేస్తున్నా ఐటిడీఏ పరిధిలోని గిరిజన విద్యాలయాలు మాత్రం ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. అధికారులు నిధులు విడుదల చేశామని చెబుతున్నా చాలా పాఠ‌శాల‌లు ఇబ్బందులు న‌డుమ కొన‌సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థులు నానా ఇబ్బందుల మ‌ధ్య చ‌దువు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ద‌య‌నీయ స్థితిలో పాఠ‌శాల‌లు..

చాలా చోట్ల ద‌య‌నీయ ప‌రిస్థితుల్లో పాఠ‌శాల‌లు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక్క చింతగూడ ప్రాథమిక పాఠశాలను పరిశీలిస్తే.. విద్యార్థులకు అనేక సమస్యలున్నాయి.. వంటగది లేదు. మరుగుదొడ్లు, కనీసం వాష్ రూమ్‌లు సైతం లేవు. ఇక్కడున్న విద్యార్థులకు ఒక్క ఉపాధ్యా యురాలు మాత్ర‌మే ఉన్నారు. వర్షం వస్తే పాములు రావడం, వర్షపునీరు గదుల్లోకి వ‌స్తోంద‌ని పిల్లలు , ఉపాద్యాయురాలుతో పాటు గ్రామస్తులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పాఠ‌శాల‌కు ఉన్న త‌లుపులు, కిటికీలూ సైతం స‌క్ర‌మంగా లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల విద్యార్థులు చెట్ల కిందే చదువులు సాగిస్తున్నారు.

క‌ష్టాల మ‌ధ్యే పిల్ల‌ల చ‌దువులు..

ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో చాలా పాఠ‌శాల‌ల పరిస్థితి ద‌య‌నీయంగా ఉంటుంద‌ని చెబుతున్నారు ఆదివాసీలు. మంచిర్యాల‌, కొమురంబీం, ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక సదుపాయలు లేక పిల్లలు కష్టాల మద్యనే చదువులు సాగిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా నార్నూర్, గాదిగూడ, జైనూర్, తిర్యాణి మండ‌లాల్లో పాఠ‌శాల‌లు స‌క్ర‌మంగా లేక ఇబ్బందులు ప‌డుతున్నారు. రూఫ్ , ఫ్లోర్ బాగా లేకపోవడమే కాదు గదులు సైతం సక్రమంగా లేవు. కొన్ని చోట్ల అంగన్వాడి సెంటర్లు సైతం ఇవే పాఠ‌శాల‌ల్లో నిర్వహిస్తుండగా వంటశాల సైతం ఇందులో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల చదువులు సక్రమంగా సాగడంలేదు. చాలా పాఠ‌శాల‌ల్లో విద్యుత్ సరఫరా లేదు. కొన్ని స్కూల్స్ లో ఫ్యాన్లు,లైట్లు ఉన్నా మీటర్ కనెక్షన్ కట్ చేసి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఉంది. కొన్ని స్కూల్స్ లో విద్యుత్ మీటర్ల వద్ద పిట్టగూళ్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. ఏడాది రెండేళ్లుగా విద్యుత్ సరఫరా లేదంటే పాఠ‌శాల‌ల‌ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి..

ఐటిడీఏ పరిధిలో గిరిజన పాఠశాలల్లో సైతం అమ్మఆదర్శ పాఠశాల మాదిరిగానే సదుపాయలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ పని పాఠ‌శాల‌ల‌ ప్రారంభం కంటే ముందే చేయాల్సి ఉన్నా నిధుల లేమి ఇతర సమస్యల వల్ల ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరితగతిన గిరిజన పాఠశాల్లో సదుపాయాలు మెరుగుప‌ర్చాల‌ని కోరుతున్నారు. విద్యార్థులు బడికి దూరం కాకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. కనీస సౌకర్యాలు సైతం కల్పించకపోతే ఆదివాసీలకు విద్య అందని ద్రాక్షగానే మారిపోతుంద‌ని, ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story

Most Viewed