నలుగురు మృతి చెందినా పట్టించుకోని అధికారులు

by Prasanna |
నలుగురు మృతి చెందినా పట్టించుకోని అధికారులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : ‘కల్తీ కల్లు’ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. నలుగురు మృతి చెందడం మహబూబ్ నగర్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే కల్తీకల్లే మరణాలకు, ఆస్పత్రి పాలవడానికి కారణమని మొదట చెప్పిన కుటుంబీకులు, ఆ తర్వాత మాట మార్చడం పలు అనుమానాలకు తావిస్తున్నది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా కల్లీ కల్లు కారణం కాదని చెప్పడం విపక్షాల ఆగ్రహానికి కారణమైంది. అయితే తీవ్ర విమర్శలు రావడంతో అబ్కారీ శాఖ తాజాగా 150 కల్లు డిపోల నుంచి శాంపిళ్లు సేకరించింది. ఈ పరీక్షల్లోకూడా వాస్తవాలు వెలుగుచూసే అవకాశాలు లేవని, కల్తీ కల్లు మాఫియాకు రాజకీయ నాయకుల అండ ఉండటమే దీనికి కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అసలేం జరిగింది..?

మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, వనపర్తి, నవాబ్ పేట తదితర ప్రాంతాల్లో సుమారు 45 మంది వరకు తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. వీరిలో నలుగురు మృతి చెందారు. కల్తీ కల్లు కారణంగానే వీరు అస్వస్థతకు గురయ్యారని మొదట వైద్యులు మీడియాతో చెప్పారు. బాధితుల కుటుంబ సభ్యులు కూడా కల్తీ కల్లే తమవాళ్ల ప్రాణాల మీదకు తెచ్చిందని బోరున విలపించారు. విపక్షాలు కూడా తీవ్రస్థాయిలో విమర్శించాయి. బాధిత కుటుంబీకులను ఆదుకోవడంతోపాటు బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశాయి.

మంత్రి ప్రెస్ మీట్ పై విపక్షాల ఫైర్..

ఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టారు. విషాదానికి కల్తీ కల్లు ఒక్కటే కారణం కాదని చెప్పారు. అనారోగ్య సమస్యల వల్ల కొందరు చనిపోయారన్నారు. ఘటనపై విచారణ జరిపిస్తామని, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీనిపై బీజేపీ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంఘటన జరిగిన ఆరు రోజులకు విషాదానికి కల్తీ కల్లు కారణం కాదని మంత్రి ఎలా చెప్తారని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరిగేవరకు వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ప్రజా సంఘాలు సైతం ఘటనపై పూర్తి విచారణకు డిమాండ్ చేశాయి. కిడ్నీ సమస్య ఉంటే బాధితులు పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తారా? అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

మాఫియా స్టెప్స్..

అప్పుడే కల్తీ కల్లు మాఫియా పావులు కదిపినట్టు తెలిసింది. మృతి చెందిన వారి కుటుంబీకులతోపాటు చికిత్స పొందుతున్న వారిని తమ వైపు తిప్పుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో బాధితులకు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్లు ప్రచారం జరిగింది. దాంతో అప్పటివరకు కల్తీ కల్లు కారణంగానే తమవాళ్లు ఆస్పత్రి పాలయ్యారు, చనిపోయారు అని చెప్పిన వారు ఒక్కసారిగా మాట మార్చారు. అనారోగ్యం వల్లనే తమవాళ్లు చనిపోయారని మీడియా ముందు చెప్పారు. మొదట కల్తీ కల్లు కారణమని చెప్పారు కదా అని అడిగితే తమకేం తెలియదంటూ సమాధానం దాటవేశారు. అనారోగ్యానికి కల్తీ కల్లే కారణమని చెప్పిన వైద్యులు కూడా మాట మార్చేశారు. ఇదంతా ఏప్రిల్ 6వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య జరిగింది.

శాంపిళ్ల సేకరణ..

ఇటీవల జిల్లా మొత్తం నుంచి 150 కల్లు శాంపిళ్లను ఎక్సయిజ్ అధికారులు సేకరించారు. పరీక్షల నిమిత్తం వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అయితే, ఈ పరీక్షల్లో అసలు నిజాలు వెలికి వస్తాయన్న నమ్మకం తమకు లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రైవేట్ ల్యాబ్ లో పారదర్శకంగా పరీక్షలు జరిపిస్తే నిజాలు బయట పడతాయని చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed