Musi River: మూసీకి భారీ వరద.. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక

by Y.Nagarani |
Musi River: మూసీకి భారీ వరద.. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాసులకు త్రాగునీరు అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. జలాశయాలకు వరదనీరు భారీగా వచ్చి చేరుతుండటంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి 6 గేట్లు, హిమాయత్ సాగర్ నుంచి 1 గేటు ఎత్తి నీటిని వదిలారు.

వరదనీరు విడుదల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వరద పెరిగితే నీటమునిగే అవకాశం ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. మూడు రోజుల క్రితం కూడా ఉస్మాన్ సాగర్ కు వరద పోటెత్తింది. ఎఫ్టీఎల్ స్థాయికి నీరు చేరడంతో.. 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

మూసీకి వరద పోటెత్తినప్పుడల్లా 1908లో సంభవించిన విలయమే గుర్తొస్తుంది. 116 ఏళ్ల క్రితం జరిగిన మూసీ విలయంలో వేలాది మంది అసువులు బాశారు. నాటి డ్రైనేజీ వ్యవస్థనే కాస్త మార్పులు చేర్పులు చేసి.. నేటికీ కొనసాగిస్తున్నారు. అందుకే.. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా భాగ్యనగరం మునిగిపోవడానికి కారణం సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే అన్న విమర్శలు నేటికీ వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed