సంక్షేమ పథకాలపై తొందరపాటు వద్దు.. సీఎస్ శాంతికుమారి

by Rajesh |
సంక్షేమ పథకాలపై తొందరపాటు వద్దు.. సీఎస్ శాంతికుమారి
X

దిశ, తెలంగాణ బ్యూరో : అర్హత లేకున్నా పలు సంక్షేమ పథకాలను అనర్హులు అందుకుంటున్నారంటూ ఇటీవల గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి నుంచి రికవరీ చేయడానికి తీసుకుంటున్న చర్యలను నిలిపివేయాలంటూ ప్రధాన కార్యదర్శి సర్క్యులర్ జారీచేశారు. వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న అన్ని శాఖల కార్యదర్శులకు, జిల్లాల కలెక్టర్లకు ఈ సర్క్యులర్‌ను పంపారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా అనర్హులు అందుకుంటున్న లబ్ధిని రికవరీ చేయడానికి నోటీసులు ఇవ్వడంగానీ, రికవరీ చేసుకునే చర్యలనుగానీ వెంటనే నిలిపివేయాలని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. త్వరలోనే ప్రభుత్వం నిర్దిష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తుందని, అప్పటివరకూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాల ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చాలో, పకడ్బందీగా ఎలా అమలు చేయాలో మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించబోతున్నదని, అర్హత లేకపోయినా వాటిని ప్రస్తుతం పొందుతున్నట్లయితే వారి నుంచి రికవరీ చేయడానికి కూడా ప్రభుత్వం విధివిధానాలను రూపొందించాల్సి ఉన్నదని, అవి ఖరారై ప్రకటన వచ్చే వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని, రికవరీ కోసం చర్యలు తీసుకోవద్దని చీఫ్ సెక్రెటరీ ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఆసరా పింఛన్లు అందుకుంటున్నారంటూ ఇటీవల కొత్తగూడెం కలెక్టర్ నోటీసులు జారీచేసిన అంశం వెలుగులోకి రావడంతో దిద్దుబాటు చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా కూడా నిబంధనలకు విరుద్ధంగా అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

రైతుబంధు విషయంలోనూ రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. విపక్షాలు దీన్ని అస్త్రంగా మార్చుకుని విమర్శలు చేస్తుండడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. అర్హత లేకపోయినా సంక్షేమ పథకాల ఫలాలను కొద్దిమంది అందుకుంటున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ఆ సర్క్యులర్‌లో గుర్తుచేశారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైనవారికే అందడంపై ప్రభుత్వం లోతుగా చర్చిస్తూ ఉన్నదని, అందుకు అవలంబించాల్సిన విషయాలను బడ్జెట్ సమావేశాల సందర్భంగా డిస్కస్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నదని చీఫ్ సెక్రెటరీ ఆ సర్క్యులర్‌లో ఉదహరించారు.

Advertisement

Next Story

Most Viewed