మెదడువాపుతో యువకుడి మృతి.. నిజమాబాద్ లో కలకలం

by Nagam Mallesh |
మెదడువాపుతో యువకుడి మృతి.. నిజమాబాద్ లో కలకలం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ః నిజామాబాద్ జిల్లాలో మెదడువాపు వ్యాధితో వ్యక్తి మృతి చెందడం సంచలనం రేపుతోంది. జిల్లాలో ఇప్పటికే డెంగ్యూ కేసులు పెరిగి భయపెడుతున్నాయి. రోగులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు కూడా తీసుకుంటున్నారు. దీనికి తోడు ఇప్పుడు మెదడు వాపు వ్యాధి కలకలం రేపుతోంది. భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామంలో ఎల్లుళ్ల శ్రీనివాస్ (35) అనే యువకుడు మెదడు వాపు వ్యాధితో గురువారం సాయంత్రం మృతి చెందాడు. నాలుగైదు రోజులుగా తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతున్న శ్రీనివాస్ ను కుటుంబ సభ్యులు ఆర్మూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేర్చే సమయానికే వ్యాధి తీవ్రత పెరిగి ట్రీట్మెంట్ కు రోగి శరీరం సహకరించని స్టేజీ లో ఉందని లైఫ్ హాస్పిటల్ డాక్టర్ భాను రాంగిరి 'దిశ'కు తెలిపారు. ఇరిటేటెడ్ సిచ్యువేశన్ లో ఉన్న రోగిని ఐసీయూ లో ట్రీట్మెంట్ అందించినా లాభం లేకపోయిందన్నారు. మృతుడు పేద కుటుంబానికి చెందిన వాడు. స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు అంత్యక్రియలకు ఆర్థిక సహకారం అందించారు. చెట్టంత కొడుకును కోల్పోయిన మృతుడి తల్లి దండ్రులు ఎల్లుళ్ల భోజన్న, నర్సులు కొడుకు మృతదేహం పై పడి రోదిస్తుండడం అందరినీ కలిసి వేసింది.

మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన శ్రీనివాస్ ఇటీవలే సెలవులపై సొంతూరికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. గల్ఫ్ లో పని కూడా సరిగా లేక తక్కువ జీతంతో ఈ జీవితం నెట్టుకొస్తున్నానని శ్రీనివాస్ తరచూ తన తమకు చెప్పుకుని బాధపడేవాడని స్నేహితులన్నారు. కొద్ది రోజుల్లో తిరిగి గల్ఫ్ దేశానికి వెళ్లాల్సి ఉండగా ఇలా మెదడు వాపు వ్యాధితో మృతి చెందడం బాధాకరమని స్థానికులంటున్నారు.

మృతుడి కుటుంబానికి బాకీలు కూడా బాగానే ఉన్నాయని.. అవి తీర్చడానికైనా తిరిగి గల్ఫ్ వెళ్లాల్సిందేనని కొద్దిరోజుల క్రితమే శ్రీనివాస్ తన స్నేహితులతో అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితం బడా భీంగల్ సమీప తండాలో కూడా ఒకరికి డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని తెలిసింది.

Next Story

Most Viewed