మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాలు ఎప్పుడో ?

by Sridhar Babu |
మార్కెట్ కమిటీ చైర్మన్ల  నియామకాలు ఎప్పుడో ?
X

దిశ, పిట్లం : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాలపై రోజురోజుకు జాప్యం కొనసాగుతుంది. చైర్మన్ల నియామకాలు ఎమ్మెల్యే చేతిలో ఉన్నప్పటికీ ఎందుకు నియమించడం లేదనే విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జుక్కల్ నియోజకవర్గం పరిధిలో మద్నూర్, బిచ్కుంద, పిట్లంలలో మూడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క మార్కెట్ కమిటీకి చైర్మన్ ను, పాలకవర్గాన్ని నియమించలేదు.

దాంతో ఆరు నెలలుగా ఆశవాహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద, పిట్లం చైర్మన్ల నియామకాలపై స్థానికంగా ఉన్న నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఈ జాప్యానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సంస్థాగత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల ఆదిపత్య పోరు కారణంగా నాయకులు, కార్యకర్తల మధ్య రోజురోజుకు దూరం పెరుగుతోందని తెలుస్తోంది.

ఈ కారణంగా కిందిస్థాయి నాయకుల్లో సమన్వయ సాధన ఎమ్మెల్యేకు కత్తిమీద సాములా మారడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంపై జాప్యం వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు దృష్టికి తీసుకెళ్లినా సరైన సమాధానం చెప్పకుండా త్వరలోనే నియామకాలు చేపడతామని దాటవేస్తున్నారని సమాచారం.

ఎమ్మెల్యేపై ఒత్తిడి

ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల మార్కెట్ కమిటీలకు పాలకవర్గ నియామకాలు చేపట్టారు. దీంతో జుక్కల్ నియోజకవర్గంలో కూడా ఆశవాహుల నుంచి ఎమ్మెల్యేకు ఒత్తిడి ఎక్కువైనట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో సీనియర్, జూనియర్ నాయకులతో పాటు కొత్తగా పార్టీలోకి చేరిన నాయకుల మధ్య బేదాభిప్రాయాలు ఉండటంతో చీలిక తెచ్చే ప్రమాదం పొంచి ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. పార్టీలో చాప కింద నీరులా విభేదాలు పెరిగిపోవడం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారే అవకాశాలున్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

ఎమ్మెల్యేతో అతి సన్నిహితంగా ఉండే కొందరు నాయకులు ఈ విషయాలన్నీ ఆయన దృష్టికి తీసుకుపోయినప్పటికీ చర్యలు చేపట్టకపోవడంతో ఆ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే మౌనం నియోజకవర్గంలోని పార్టీలో అంతర్గత క్రమశిక్షణను దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని పలువురు సీనియర్ నాయకులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed