ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్, మేనేజర్ల మధ్య మాటల యుద్ధం..

by Aamani |
ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్, మేనేజర్ల మధ్య మాటల యుద్ధం..
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, మున్సిపల్ మేనేజర్ హయూంల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్నట్లు ఆలస్యంగా తెలిసింది. ఆర్మూర్ మున్సిపల్ మేనేజర్ హయుం పర్సనల్ పనిపై హైదరాబాద్ వెళ్లే అవసరం ఉందని సెలవు కావాలని మున్సిపల్ కమిషనర్ రాజును కోరగా, నీకు ఏ పని లేదని ఇంచార్జ్ కమిషనర్ గా నియామకం అయ్యేందుకే హైదరాబాదు నుండి సీడీఎంఏ కు వెళ్లి పైరవీ చేసేందుకే వెళుతున్నట్లు వాదనకు దిగారు. సెలవు ఇవ్వడం కుదరదని కమిషనర్ రాజు కరాకండిగా మేనేజర్ హయూమ్ తో మాటలు యుద్ధం చేశాడు.

గతంలో నువ్వు ఆర్మూర్ ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన టైం లో ఇష్టారీతిగా ఇచ్చిన ఇంటి నంబర్ల చిట్టాను బయటపెట్టి సస్పెండ్ చేయిస్తానని కమిషనర్ తీవ్రంగా మేనేజర్ పై మండిపడ్డారు. దీంతో మున్సిపల్ మేనేజర్ హయూమ్ సైతం అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు (కమిషనర్) వాడుతున్న కారుకు ప్రతి నెల ఈఎంఐ డబ్బులు కూడా మున్సిపల్ ద్వారానే చెల్లిస్తున్నారని, కారుకు వాడే డ్రైవర్ జీతాన్ని కూడా ప్రతి నెల వేతనాన్ని వాటర్ సెక్షన్ నుండి తప్పుడు బిల్లులు పెడుతూ చెల్లిస్తున్నారని కమిషనర్ రాజు పై మేనేజర్ ఆరోపించారు.

ఇదంతా తతంగం పలువురు ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ఎదుట బహిరంగంగా ఆర్మూర్ మున్సిపల్ అధికారులు ఇష్టారీతిగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేస్తూ అవినీతి ఆరోపణలను చేసుకున్నారు. ఈ విషయాలను ఫోటోలు తీసేందుకు అక్కడికి వెళ్లిన పలువురు మీడియా ప్రతినిధులను ఎలాంటి ఫోటోలు తీయవద్దని వీడియోలు తీయవద్దని మున్సిపల్ కమిషనర్ రాజు డ్రైవర్ వారించి అడ్డుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని కావాలనే మున్సిపల్ కమిషనర్ వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ మేనేజర్ హయూమ్ అక్కడ వారించినట్లు తెలిసింది. త్వరలో జరగబోయే మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కమిషనర్ అవినీతి ఆరోపణలు రుజువులతో నిరూపిస్తానని మున్సిపల్ మేనేజర్ హయ్యూం అక్కడ అన్నట్లు తెలిసింది. చివరకు ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య భర్త అయ్యప్ప శ్రీనివాస్, వైస్ చైర్మన్ షేక్ మున్న, పలువురు మైనార్టీ కౌన్సిలర్లు వారి ఇరువురిని సముదాయించి గొడవను ఆపి వేయించారు.

ఆర్మూర్లో అవినీతి ఆరోపణలపై జోరుగా జరుగుతున్న చర్చ.. ఇరువురు అధికారుల వాగ్వాదం మాటల యుద్ధంతో బట్టబయలు..

ఆర్మూర్ మున్సిపల్ లో అవినీతి ఆరోపణలు జోరుగా జరుగుతున్నాయని ఆర్మూర్ ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా కనీసం పాలకవర్గానికి సంబంధం లేకుండా మున్సిపల్ లో పలు అధికారులు నోటీసులు జారీ చేస్తూ సదరు వ్యక్తులను రప్పించుకుంటూ బేరసారాలు చేస్తూ భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆర్మూర్లో ఆరోపణలు గుప్పు మంటున్నాయి. దీనికి గురువారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజు, మేనేజర్ హయూమ్ ల మధ్య మాటల యుద్ధం, తారాస్థాయికి చేరి ఒకరికొకరు వాగ్వాదం చేసుకున్నారు.

ఈ ఇరువురు అధికారులు మున్సిపల్ కార్యాలయంలో అధికారులందరూ, పలువురు పత్రికా విలేకరులు అందరూ చూస్తుండగానే ఒకరిపై ఒకరు బహిరంగంగానే అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. ఇరువురు అధికారుల మాటల యుద్ధం, ఒకరిపై ఒకరు చేసుకున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి దండిగా భారీ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతుందన్నట్టు ఆర్మూర్ ప్రజలు చర్చించుకుంటున్నారు. అవినీతి అరికట్టి ప్రజాధనంతో వేతనాలు పొందే అధికారులే ఇలాంటి అవినీతిలకు పాల్పడుతున్నట్లు ఒకరినొకరు ఉద్యోగులు పలువురు విలేకరుల ముందే బహిరంగంగా మాటల యుద్ధం తో వాగ్వాదం చేసుకుంటే ఈ మున్సిపల్ ఉన్నతాధికారులు ఈ చర్య పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed