Sachin Pilot: ప్రియాంక, రాహుల్ కలిస్తే బీజేపీకి నిద్రలేని రాత్రులే- సచిన్ పైలట్

by Shamantha N |
Sachin Pilot: ప్రియాంక, రాహుల్ కలిస్తే బీజేపీకి నిద్రలేని రాత్రులే- సచిన్ పైలట్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన ప్రియాంక గాంధీపై ఆ పార్టీనేత సచిన్ పైలట్(Sachin Pilot) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) కచ్చితంగా విజయం సాధిస్తారని సచిన్‌ పైలెట్‌ పేర్కొన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈమేరకు కామెంట్లు చేశారు. ‘వయనాడ్‌ నుంచి ప్రియాంక ఘన విజయం సాధించాలని అందరం ఎదురుచూస్తున్నాం. ఆమె చాలా ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. గతంలో ఎన్నికల బరిలో నిలవకపోయినా.. రాహుల్‌గాంధీ, సోనియా గాంధీలకు మద్దతుగా విస్తృతమైన ప్రచారం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా క్యాడర్‌ను చైతన్యపరచడంలో ఆమె తన సత్తా చూపారు. పార్లమెంట్‌లో కేరళలోని ప్రజల కోసం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు, యువకుల కోసం ఆమె తన గళాన్ని విప్పుతారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌ గాంధీ ఉండటంతో ప్రభుత్వం మరింత జవాబుదారీతనంగా వ్యవహరించే పరిస్థితి నెలకొంది. ఇక, పార్లమెంటులో రాహుల్‌, ప్రియాంకలు కలిస్తే బీజేపీ, ఎన్డీఏలకు నిద్ర లేని రాత్రులే మిగులుతాయి’ అని ఆయన తెలిపారు.

లోక్ సభ ఎన్నిక

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్‌ గాంధీ విజయం సాధించారు. అయితే, రాయ్ బరేలీ నుంచి కూడా ఆయన గెలవడంతో.. వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. ఈక్రమంలోనే ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రియాంక పోటీకి దిగారు. ఈనెల 13న వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈనెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి

Advertisement

Next Story