నిండు జీవితానికి రెండు చుక్కలు : జిల్లా కలెక్టర్

by Sridhar Babu |   ( Updated:2024-03-02 09:39:47.0  )
నిండు జీవితానికి రెండు చుక్కలు : జిల్లా కలెక్టర్
X

దిశ, కామారెడ్డి : నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించాలని, అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరూ పోలియో వ్యాధిబారిన పడరని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి నుంచి ప్రధాన వీధుల గుండా నిజాంసాగర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ నెల 3న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. అన్ని నివాస ప్రాంతాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, అంగన్వాడీ కేంద్రాలు, పల్స్ పోలియో బూత్ లు, రైల్వే స్టేషన్, బస్టాండ్ ల వద్ద ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలియో నివారణకై చుక్కల మందు వేయడం జరుగుతుందన్నారు.

పిల్లలు జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా వారికి చుక్కల మందు వేయించాలని సూచించారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేయించాలని కోరారు. పల్స్ పోలియో అవగాహన ర్యాలీలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఏఎంఎంలు, ఆశ వర్కర్లు, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed