ఒక్కళ్ళు పెట్టడం.. ఇంకొకళ్ళు నరకడం...

by Sumithra |
ఒక్కళ్ళు పెట్టడం.. ఇంకొకళ్ళు నరకడం...
X

దిశ, ఆర్మూర్ : గత తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అడవుల విస్తీర్ణమే లక్ష్యంగా హరితహారం పథకంలో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని మున్సిపల్ పట్టణ కేంద్రంతో పాటు, అన్ని మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రధాన రోడ్ల వెంబడితో పాటు ఖాళీ స్థలాల్లో, పాఠశాలల ఏరియాల్లో, ప్రైవేట్ నివాసాల వద్ద విరివిగా అడవుల విస్తీర్ణమే లక్ష్యంగా మొక్కల పెంపకాలను చేపట్టారు. హరితహారం పథకంలో పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా మున్సిపల్, మండల పరిషత్ అధికారులు వార్డుల గ్రామాల అధికారుల చేత మొక్కలు నాటించారు. కానీ మొక్కలు నాటే సమయంలో ఆ అధికారులు కనీస అవగాహన లేకుండా పట్టణ కేంద్రాలతో పాటు, గ్రామాల్లో రోడ్ల వెంబడి గల విద్యుత్ తీగల క్రింద భాగంలో హరితహారంలో మొక్కలు నాటి ఆ చెట్లకు నీళ్లు పట్టించి పెంచారు.

కానీ విద్యుత్ మరమ్మత్తుల్లో భాగంగా అధికారులు ప్రజాసొమ్మును ఖర్చు చేసి హరితహారం పథకంలో పెట్టిన మొక్కలు మారిన వృక్షాలను విద్యుత్ తీగలకు ఇబ్బందికరంగా తయారై తగులు తున్నాయని విద్యుత్ తీగల మరమ్మత్తుల (మెయింటెనెన్స్) కింద నరికి వేస్తున్నారు. ప్రజాధనాన్ని వెచ్చించి అడవుల విస్తీర్ణమే లక్ష్యంగా హరితహారం పథకంలో ఓ అధికారులు మొక్కలు నాటితే.. మరో అధికారులు విద్యుత్ తీగలకు ఇబ్బందిగా ఉన్నాయని మరమ్మత్తుల కింద ప్రజాధనాన్ని వెచ్చించి పెంచిన మొక్కలను నరికి వేస్తున్నారు. హరితహారం పథకంలో మొక్కలు నాటిన అధికారులకు, విద్యుత్ తీగల మరమ్మత్తుల కింద మొక్కలు నరుకుతున్న అధికారుల చర్యలను చూస్తే జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఏది ఏమైనా అడవుల విస్తీర్ణం కోసం మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తూ పెంచడం చాలా బ్రహ్మాండమైన విషయం. కానీ ప్రజాధనాన్ని వెచ్చించి నాటిన మొక్కలు మరి ఇతర అధికారులు నరకకుంట అనువైన స్థలాలను ఎంపిక చేస్తూ నాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరితహారం పథకంలో మొక్కలు నాటడం వాటిని నరకడం ద్వారా వృధాగా పోతున్న ప్రజాధనాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని ఆర్మూర్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed