జనసంద్రమైన లింబాద్రి గుట్ట.. అట్టహాసంగా నారసింహుడి జాతర

by Shiva |
జనసంద్రమైన లింబాద్రి గుట్ట.. అట్టహాసంగా నారసింహుడి జాతర
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: గౌతమీ (గోదావరి) నదికి దక్షిణ దిశగా రెండు యోజనాల దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీనారసింహుడి దివ్యక్షేత్రం నింబాచలంగా విలసిల్లుతున్నది.దట్టమైన వేప చెట్లతో నిండి ఉండడంతో ఈ గుట్టకు నింబాచలంగా పేరు వచ్చినట్లు చరిత్ర. నిజామాబాద్ జిల్లా భీమ్‍గల్ శివారులోని లింబాద్రి గుట్టపై కొలువైన లింబాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం కార్తీక పౌర్ణమి రోజున స్వామి వారి రథభ్రమణం, జాతర వేలాది మంది భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.

ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున జరిగే ఈ జాతర కోసం ఎప్పటిలాగే భక్తులు జిల్లా నలుమూలల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి డిపో నుంచి ప్రత్యేకంగా జాతరకు ప్రత్యేకంగా బస్సులు నడిపారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్, సిద్ధిపేట్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, జాల్నా, ఔరంగాబాద్, భీవండి, పూణె జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో స్వామివారిని దర్శించుకోడానికి వచ్చారు. కొందరు కుటుంబంతో సహా ప్రత్యేక వాహనాల్లో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

తెల్లవారుజాము రెండు గంటల నుంచే స్వామి వారిని దర్శించుకోడానికి భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులుతీరారు. గర్భాలయంలో సువర్ణాలంకార భూషితుడైన స్వామి వారిని దర్శించుకుని భక్తులు మొక్కలు మొక్కుకున్నారు. కోరిన కోరికలు తీరిన భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లలో స్వామి వారి దర్శనం కోసం గంటల కొద్దీ సమయం పట్టినా ఓపిగ్గా క్యూలైన్లలో నిల్చుని స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లలో భక్తులకు దాహం వేస్తే తాగునీరందక ఇబ్బందులు పడ్డారు.

మధ్యాహ్నం రథోత్సవం ప్రారంభం

శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం నిర్దేశించిన సమయం కన్నా 2 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమైంది. అప్పటి వరకు రథభ్రమణం కన్నా ముందుగా నిర్వహించే పలు కార్యక్రమాలు, పూజాధికాలను అర్చక స్వాములు నిర్వహించారు. ముందుగా స్వామి వారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను మండపం నుంచి మేళతాళాలతో, సన్నాయి వాయిద్యాల నడుమ పల్లకీలో ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొచ్చారు. పల్లకీని స్వామి వారు ఊరేగే రథం ఎదురుగా ఉంచి పూజాధికాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు, అమ్మవార్లు కొలువై ఉన్న పల్లకీని రథం చుట్టూ ఐదు చుట్లూ ప్రదక్షిణ గావించారు. సంతానం కోసం మొక్కుకున్న దంపతులు పూలతో తొట్లెలు అల్లి తెచ్చి రథానికి కట్టి మొక్కుకున్నారు. ఇలా చేస్తే ఏడాది తిరిగేసరికి ఆ దంపతులకు స్వామి వారి అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులకు ప్రగాఢంగా నమ్ముతారు.

అందుకే సంతానం లేని దంపతులు పూలతో అల్లిన తొట్లెలను రథానికి కట్టే సంప్రదాయం ఏళ్లుగా కొనసాగుతోందని అర్చకులు తెలిపారు. అనంతరం స్వామి వారికి హారతులిచ్చి స్వామివారి ఆశీర్వాదం భక్తులకు అందే విధంగా హారతిని భక్తుల వైపు చూపగా దూరం నుంచే భక్తులు హారతిని కళ్లకు అద్దుకున్నారు. పల్లకీలో ఉత్సవ మూర్తులకు అలంకరించిన పూలదండలు, స్వామివారి ఆయుధం, శ్రీ చక్రాన్ని ముందుగా హరి పంతులు రథంపైకి చేర్చారు. స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను భక్తులందరి జయజయ ధ్వానాల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి తన చేతుల మీదుగా రథంపైకి చేర్చి రథం శీర్షభాగంలో ఉన్న గురుడ వాహనం మీదకు చేర్చి గరుడ వాహసంపై కొలుఉంచారు.

తన రథోత్సవాన్ని కళ్లారా తిలకించేందుకు సుదూరప్రాంతాల నుంచి కొండపైకి వచ్చిన భక్తుల దర్శనమిచ్చారు. అనంతరం స్వామి వారి సమక్షంలో రథం ఎదురుగా స్వామి వారికి అన్నప్రసాద నైవేద్యం సమర్పణ, కూష్మాండ బలి, బలిహరణం వంటి కార్యక్రమాలు భక్తుల గోవిందా నామస్మరణల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించారు. అనంతరం కొండపై గర్భాలయంలో కొలువైన స్వామివారి దర్శనాలను నిలిపివేసి గర్భాలయ తలుపులు మూసివేసి అర్చకులు గర్భాలయం ద్వారపు తాళాలు డప్పుల చప్పుళ్ల మధ్య అర్చకులు తీసుకొచ్చి ఆలయ ప్రధాన అర్చకుడు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నంబి పార్థసారథి చేతికందించారు. రథాన్ని ముందుకు లాగేందుకు రథానికి రెండు వైపులా రెండు బలమైన పొడవాటి తాళ్లను కట్టారు. భక్తులు ఆ తాళ్లను పట్టుకుని లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి గోవిందా.. గోవిందా.. అంటూ ముందుకు లాగుతూ కదిలారు. రథాన్ని లాగుతున్న క్రమంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. రథానికి అలంకరించిన పూల దండల కోసం భక్తులు పోటీ పడ్డారు. రథంపై ఉన్న అర్చకులు పూల దండలు అక్కడక్కడా భక్తులపై విసిరేయగా వాటిని అందుకోడానికి పోటీ పడ్డారు.

స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం సందర్భంగా రాజకీయ ప్రముఖులు రథోత్సవంకు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దోల్ల గంగారెడ్డిలు ముందుగా స్వామి వారి దర్శనానికి రాగా, ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి వారికి ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, టీజీఎస్ ఎండీసీ చైర్మన్ అనిత్ ఈరవత్రి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ చార్జి ముత్యాల సునీల్ రెడ్డిలు, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిలు కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.

రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి లింబాద్రి గుట్టకు వస్తుండగా ట్రాఫిక్ లో ఇరుకు పోగా దాదాపు కిలో మీటరుకు పైగా దూరం నడుచుకుంటూ తన కార్యకర్తలతో గుట్టకు చేరుకున్నారు. రథ భ్రమణం ప్రారంభం కన్నా ముందుగానే గుట్టకు చేరుకోవాలనే ఆలోచనతో దాదాపు పరుగెత్తినట్లుగా వేగంగా నడిచి గుట్టకు చేరుకున్నాడని ఆయన వెంట నడిచిన కార్యకర్తలు తెలిపారు. తను గుట్టకు వస్తున్నట్లు తెలిసే కావాలని ట్రాఫిక్ జామ్ చేయించారని, గుట్టపై కూడా రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోటీ అనేది అభివృద్ధిలో చూపాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుగు ప్రయాణంలో ప్రశాంత్ రెడ్డి పురానీపేట్ మీదుగా కాకుండా పల్లికొండ మీదుగా భీమ్‍గల్ వైపుకు వెళ్లారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed