రూ.25 కోట్లతో కట్టిన బ్రిడ్జి.. అప్పుడే కుంగిపోతున్న వైనం

by Nagam Mallesh |
రూ.25 కోట్లతో కట్టిన బ్రిడ్జి.. అప్పుడే కుంగిపోతున్న వైనం
X

దిశ, నిజాంసాగర్: ఏ గ్రామాలైన అభివృద్ధి చెందాలంటే రోడ్డు రవాణా వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఆ సంకల్పంతోనే గతంలో అప్పుడున్న ప్రభుత్వం నిజాంసాగర్ మంజీరా నదిపై నిజాంసాగర్ మండల కేంద్రంలో హై లెవెల్ వంతెన రూ. 25 కోట్లతో నిర్మించింది. కోట్లు వెచ్చించి నిర్మించిన వంతెన సంవత్సరం పూర్తి కాకముందే నాసిరకం నిర్మాణంతో గుంతల మయంగా మారింది. నిజాం రాజుల కాలంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరడంతో రూ. 25 కోట్లతో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వంతెనకు 2016లో శంకుస్థాపన చేసింది. నత్తకు నడక నేర్పిన చందంగా ఈ వంతెన నిర్మాణం పనులు దాదాపు 8 సంవత్సరాలు కొనసాగాయి. 2023 మార్చ్ 15న అప్పుడున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ వంతెనను అధికారులు ఆర్భాటంగా ప్రారంభించారు. వంతెన ప్రారంభించడానికి ముందు నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సిన ఆర్ అండ్ బీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో వంతెన ప్రారంభించిన సంవత్సరానికే బీటలు వారుతూ వంతెన ఇరువైపుల గల రోడ్డు కుంగిపోయింది. మొన్న కురిసిన వర్షాలకు వంతెనకు ఇరువైపులా గల బీటీ రోడ్డు కృంగిపోయి గుంతల మయంగా మారడంతో వంతెనపై ప్రయాణించడానికి ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. వంతెన పై ఏర్పడుతున్న గుంతలు పగుళ్లపై అనేకమార్లు అధికారులకు విన్నవించడంతో సదరు అధికారులు కాంట్రాక్టర్ కు నోటీసులు ఇచ్చి పనులను ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా వంతెన పై గుంతల చుట్టూ గల మెటల్ని తొలగించి నామమాత్రంగా పనులు నిర్వహించారు. అయినప్పటికీ ఈ వంతెన పై ప్రయాణించడానికి వాహన దారులు జంకుతున్నారు. వంతెన పైనుండి ప్రయాణిస్తే వంతెన వైబ్రేషన్ అవ్వడం వల్ల ప్రయాణించడానికి భయం వేస్తుందని ప్రయాణికులు తెలిపారు. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం కారణంగా నిర్మించిన వంతెన సంవత్సరానికె కృంగిపోవడంతో మండల ప్రజలు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వర్షం ధాటికి వంతెన కింది భాగంలో గల మట్టి రెండు నుంచి మూడు ఇంచులు కిందికి కుంగడంతో పైనున్న బీటీ రోడ్డుకు బీటలు గుంతలు ఏర్పడ్డాయని ఆర్ అండ్ బి ఏ ఈ వినోద్ కుమార్ తెలిపారు. దీని విషయమై సదర్ కాంట్రాక్ట్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి ఏర్పడిన సమస్యలను తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

-ఆర్ అండ్ బి ఏ ఈ వినోద్ కుమార్

Advertisement

Next Story

Most Viewed