- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నుల పండుగగా శ్రీ లింబాద్రి లక్ష్మీనారసింహుని కళ్యాణం
దిశ, ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 11: నిజామాబాద్ జిల్లా భీమ్గల్ శివారులోని శ్రీమన్నింబాచల క్షేత్రం (లింబాద్రి గుట్ట) లో సోమవారం వేలాది మంది భక్తజనం సమక్షంలో స్వామివారి కళ్యాణ ఘట్టం కన్నుల పండుగగా జరిగింది. ఈనెల 8 నుంచి ప్రారంభమైన స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైంది స్వామివారి కళ్యాణం. ప్రతియేటా కార్తీక మాసంలో జరిగే స్వామి వారి కళ్యాణాన్ని కళ్లారా చూసి తరించడానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు కొండపైకి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ముందుగా గర్భాలయంలో కొలువైన స్వామివారు, అమ్మవార్లను దర్శించుకోడానికి క్యూ కట్టారు. ఓపిగ్గా క్యూలైన్ల లో స్వామివారి దర్శనం కోసం నిలుచున్న భక్తులు స్వామివారిని కీర్తించుకుంటూ ముందుకు కదిలారు. శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి గోవిందా.. గోవిందా..గోవిందా..గోవిందా అంటూ పెద్ద ఎత్తున్న కొండ ప్రాంతమంతా ధ్వనించేలా స్వామివారికి జయజయ ధ్వానాలు పలికారు. గర్భాలయంలో స్వర్ణాలంకృతభూషితుడైన స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోడానికి రెండు కళ్లు చాలాలేవని భక్తులు భక్తిపారవశ్యంతో సంతోషం వ్యక్తం చేశారు. క్యూలైన్లలో భక్తులు తొక్కిసలాటకు గురికాకుండా భక్తులను వాలంటీర్లు జాగ్రత్తలు నియంత్రించారు. కొండపైన గుహలోని గర్భాలయంలో కొలువైన స్వామి వారు, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు కొండ దిగువన పుష్కరిణి పక్కన ఉన్న స్వామి వారి కళ్యాణ మండపంలో వెళ్లి..భక్తి ప్రపత్తులతో స్వామి వారిని ధ్యానిస్తూ కూర్చున్నారు.
ముందుగా కొండపైనే స్వామివారికి కళ్యాణం..
పుష్కరిణి పక్కనున్న కళ్యాణ మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు జరిపించే కళ్యాణానికి ముందుగానే గర్భాలయంలో కొలువై ఉన్న స్వామివారు,అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు.అనంతరం పుష్పాలతో అలంకరించిన పల్లకీలో స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువుంచి అర్చకులు మంగళవాయిద్యాలు,మేళతాళాలతో ఊరేగింపుగా కొండపైనున్న మాఢవీధుల్లోకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అర్చక బృందం అమ్మవారిని ఒక పల్లకిలో ఉంచి ఆశ్వారూఢుడైన ఊరేగింపుగా వస్తున్న స్వామివారి పల్లకి ఎదురు వెళ్లి.. పుష్కరిణీ సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద అమ్మవారి పల్లకి, స్వామివారి పల్లకిలు కలిశాయి. అక్కడ అర్చకులు ఉత్సాహంగా బుకాగులాలు ఒకరిపై ఒకరు జల్లుకుంటూ అర్చక కుటుంబంలోని మహిళలు,చిన్నలు,పెద్దలు, అర్చకులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. తమను తాము మరిచిపోయి నృత్యాలు చేస్తూ.. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న తీరు భక్తులను విశేషంగా ఆకర్షించింది. అక్కడి నుండి అమ్మవారిని, స్వామవారిని ఒకే పల్లకిలో కొలువుంచి ఊరేగింపుగా స్వామి వారి కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కళ్యాణ మండపంలోని పెళ్లి మండపంలోకి తీసుకొచ్చారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నంబి లింబాద్రి నేతృత్వంలో.. ఆలయ ప్రధాన అర్చకులు కన్యాదాతగా వ్యవహరించి నిర్వహించిన స్వామివారి క్రతువును ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు.
స్వామివారి కళ్యాణ క్రతువులోని ప్రతి విషయాన్ని భక్తులకు అర్థమయ్యే రీతిలో ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వాసుబాబు తో పాటు.. మరొక అర్చకుడు కళ్లకు కట్టినట్లు వివరించారు. స్వామివారు అమ్మవారికి కట్టే తాళిబొట్టును భక్తులందరూ దర్శించుకునేలా ప్రధాన అర్చకుడు పార్థ సారథి రెండు చేతులతో పట్టుకుని భక్తులందరు దర్శనం చేసుకుని తరించేలా అందరికీ చూపించారు. భక్తిప్రపత్తులతో భక్తులంతా స్వామివారు అమ్మవారికి కట్టే తాళిబొట్టుకు దండం పెట్టుకుని మనసులో కోరికలు తలుచుకుని మొక్కుకున్నారు. ఇలా మొక్కితే అమ్మవారు,స్వామివారి కృపాకటాక్షంతో కోరుకున్న నెరవేరతాయనే విశ్వాసం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. అనంతరం అర్చకుల్లో కొందరు,కొత్త గంపతో భక్తులందరి వద్దకు స్వామి వారి కళ్యాణానికి భక్తులు సమర్పించే కానుకను స్వీకరించారు. అనంతరం స్వామి వారు అమ్మవారికి తాళికట్టి ఏకమయ్యే ఘట్టాన్ని కమణీయంగా..రమణీయంగా అర్చకుల వివరణ మధ్య భక్తులు ఆస్వాదించి ఆనందించారు. సుమారు రెండు మూడు గంటల పాటు.. జరిగిన కళ్యాణ క్రతువు తరువాత అమ్మవారు, స్వామివారు,అమ్మవారు మూడు ముళ్ల బంధంతో ఏకమయ్యారు. మానవులకు జీవితంలో ఒక సారి మాత్రమే కళ్యాణం జరుగుతుందని కానీ..భగవంతుడికి ప్రతియేటా కళ్యాణం జరుగుతుందని తెలిపిన అర్చకులు దీనికి కారణమేంటో కూడా భక్తులకు వివరించారు. భగవంతుడు లోక కళ్యాణం కోసమే ప్రతియేటా పెళ్లి జరిపించుకుంటాడని,వారి కళ్యాణంతో లోకం సుభిక్షంగా ఉంటుందన్నారు.
స్వామివారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త సోమవారం లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.బీజేపీ నాయకులు,కార్యకర్తలతో కలిసి ఆయన గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకోవడానికి కొండపైకి చేరుకున్న ఎమ్మెల్యే ధన్ పాల్ కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ధన్ పాల్ ను ఆలయ కమిటీ, అర్చక బృందం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ.. లింబాద్రిగుట్ట చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమని, ఇక్కడ కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి భక్తుల కొంగుబంగారమన్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పని ఎమ్మెల్యే ధన్ పాల్ అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా శ్రీలక్ష్మీనరసింహుడి ఆశీస్సులు జిల్లా ప్రజలపైనే కాదని, రాష్ట్ర ప్రజలందరిపైనా ఉండాలని ధన్ పాల్ అన్నారు. అనంతరం కొండపై భక్తుల సౌకర్యార్థం పద్మగంగ వీరయ్య చారిటబుల్ ట్రస్ట్ భీమ్గల్ అండ్ శ్రీవాసవి ఆర్యవైశ్యసంఘం పల్లికొండ వారి ఆధ్వర్యంలో.. నిర్వహిస్తున్న జలప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ధన్ పాల్ ప్రారంభించారు.