- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Osmania University: సంతకాలు ఫోర్జరీ.. కాలేజీ అఫిలియేషన్ రద్దు
దిశ, తెలంగాణ బ్యూరో: నిబంధనలు పాటించని ఒక ప్రైవేట్ యాజమాన్యంపై ఉస్మానియా యూనివర్సిటీ చర్యలకు దిగింది. సదరు కాలేజీ అఫిలియేషన్ ను రద్దుచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల విద్యా ధ్రువీకరణ పత్రాలను ఫోర్జరీ చేసిన ఓ కళాశాలపై ఓయూ యాక్షన్ తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తీర్ణులైన విద్యార్థులను ఫెయిలైనట్లుగా, ఫెయిలైన విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తప్పుడు సమాచారాన్ని అందించిన హిందీ మహావిద్యాలయ అనుబంధ గుర్తింపును రద్దు చేసింది. 2019-2022 విద్యాసంవత్సరానికి సంబంధించి యూజీ ఆరో సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిలైన 49 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లుగా, ఉత్తీర్ణులైన ఐదుగురు విద్యార్థులు ఫెయిలైనట్లుగా తారుమారు చేసిన జాబితాను ఓయూ పరీక్షల నియంత్రణ కార్యాలయానికి హిందీ మహావిద్యాలయం సమర్పించింది. సదరు విద్యాసంస్థ టీఆర్(ట్యాబులేషన్ రికార్డ్స్) రికార్డులపై అనుమానం రావటంతో.. ఓయూ అధికార యంత్రాంగం సమగ్ర విచారణకు ఆదేశించింది.
విచారణలో బయటపడిన అక్రమాలు..
విచారణ కమిటీ మూడు దఫాలుగా హిందీ మహావిద్యాలయ విద్యాసంస్థను సందర్శించింది. విచారణలో భాగంగా ఈ కమిటీ విస్తుపోయే అంశాలను గుర్తించింది. స్వయంప్రతిపత్తి కలిగిన హిందీ మాహావిద్యాలయ స్వయంగా పరీక్షల నిర్వహణ, పేపర్ రీవాల్యూషన్ తమ అధ్యాపకులతోనే నిర్వహిస్తోంది. ఇదే అదనుగా అక్రమాలకు పాల్పడినట్లు కమిటీ గుర్తించింది. కమిటీ విచారణలో కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు కామర్స్ సమాధాన పత్రాలను దిద్దినట్లుగా తేలింది. విద్యార్థుల మార్కుల జాబితాలన్నీ ఫోర్జరీ చేసినట్లుగా కమిటీ గుర్తించింది. పరీక్ష పత్రాలు, ఎవాల్యూషన్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కళాశాల యాజమాన్యం కమిటీకి సమర్పించకపోవటం గమనార్హం. యూనివర్సిటీ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కిన కళాశాల నిర్లక్ష్యంపై పూర్తి స్థాయిలోవిచారణ చేపట్టాల్సిందిగా కమిటీ అభిప్రాయానికి వచ్చింది. మరో దఫా కళాశాలను సందర్శించిన ఓయూ విచారణ కమిటీ యూజీ 2023-24 బ్యాచ్ టీఆర్ రికార్డుల్లో ప్రిన్సిపాల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకాలు, స్టాంపులు లేనట్లు గుర్తించింది. దీంతో.. యూనివర్శిటీ తుది నిర్ణయం తీసుకునేంత వరకు కళాశాల స్వయం ప్రతిపత్తిని అబయన్స్‌లో పెట్టాలని కమిటీ సిఫార్సు చేసింది. తుది నిర్ణయం కోసం వేసిన మరో కమిటీ సైతం ఈ ఏడాది అక్టోబర్ 4న సమగ్ర విచారణ చేపట్టింది. యూనివర్సిటీకి సమర్పించిన 2022 యూజీ 6వ సెమిస్టర్ ఫలితాలు తప్పని, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని తేల్చారు.
యూనివర్సిటీకి తప్పుడు సమాచారం
హిందీ మాహా విద్యాలయ యాజమాన్యం.. 13 మంది బీకాం, 27 మంది బీఎస్సీ, 9 మంది బీబీఏ విద్యార్థులు పాసైనట్లుగా యూనివర్సిటీకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లు కమిటీ విచారణలో తేలింది. నలుగురు బీకాం, ఒక బీబీఏ విద్యార్థి ఉత్తీర్ణులైనప్పటికీ ఫెయిలైనట్లుగా రికార్డులు తారుమారు చేశారు. ఈ విషయమై వివరణ ఇచ్చిన కళాశాల యాజమాన్యం తమ పరీక్షల విభాగం రికార్టుల్లో పొరపాట్లు జరిగినట్లు స్వయంగా అంగీకరించింది. అయినప్పటికీ తప్పు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం ఈ విషయమై పదే పదే హెచ్చరించినప్పటికీ హిందీ మహావిద్యాలయా పెద్దగా స్పందించలేదు. దీంతో విచారణ కమిటీల నివేదికలను యూనివర్శిటీ స్థాయి సంఘానికి నివేదించింది. ఈ విషయమై తీవ్రంగా స్పందించిన ఓయూ స్థాయి సంఘం( స్టాండింగ్ కమిటీ) సంబంధిత రికార్డులను సత్వరమే సీజ్ చేయాల్సిందిగా ఓయూ పరీక్షల నియంత్రణాధికారి, డీన్ సీడీసీలను అదేశించింది.
కళాశాలపై క్రిమినల్ కేసులకు సిఫార్సు
ఉస్మానియా అదనపు పరీక్షల నియంత్రణాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు గాను క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కళాశాల స్వయంప్రతిపత్తిని రద్దు చేయాల్సిందిగా యూజీసీ, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులను కోరాలని సిఫార్సు చేసింది. ఓయూ పరిధిలో మరెక్కడా హిందీ మీడియం కళాశాలలు లేనందున.. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు మినహాయింపునిచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం 2025-2026 నుంచి ఎలాంటి యూజీ అడ్మిషన్లు చేపట్టవద్దని స్పష్టం చేసింది. సాధారణంగా పీజీ తరగతులు నాన్ అటానమస్ స్టేటస్ తో కొనసాగించుకోవచ్చని తెలిపింది. తుది సెమిస్టర్ పరీక్షలను స్వయంగా యూనివర్సిటీ నిర్వహించనుంది. స్థాయీ సంఘం( స్టాండింగ్ కమిటీ) సిఫార్సుల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఫలితంగా ఎలాంటి అక్రమాలను సహించే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చింది. అనుబంధ, స్వయంప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థలు.. యూనివర్శిటీ, యూజీసీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని ఓయూ ఉపకులపతి కుమార్ మొలుగరం ఈ సందర్భంగా స్పష్టంచేశారు. విద్యా ప్రమాణాలు, పారదర్శకత, నిబంధనల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.