ఇకపై నెలకు వెయ్యి ఉద్యోగాలు ఇస్తాం : ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడి

by Bhoopathi Nagaiah |
ఇకపై నెలకు వెయ్యి ఉద్యోగాలు ఇస్తాం : ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ఇకపై నెలకు వెయ్యి ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ రహిత పార్లమెంట్ నియోజకవర్గంగా మల్కాజ్ గిరిని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. నిరుద్యోగరహిత మల్కాజ్ గిరి పోస్టర్ ఆవిష్కరించిన సందర్భంగా శామీర్ పేటలోని తన నివాసంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ ...తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతి నిత్యం నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారని, కానీ అందరికీ ఉద్యోగ అవకాశాలు రావడం లేదన్నారు. నిరుద్యోగ నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోడీ రూ. 4 లక్షల కోట్లను బట్జెట్ లో పెట్టినట్లు వెల్లడించారు. తద్వారా యువతకు పని కలిపించాలని, దేశ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలని ప్రధాని సంకల్పించారని అన్నారు.

మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలోని కంటోన్మెంట్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్ లతోపాటు హుజురాబాద్, గజ్వెల్ 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉద్యోగ కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో ఇంటింటికీ సర్వే నిర్వహించి, నిరుద్యోగుల డేటా సేకరిస్తామని, వారికి ఎలాంటి ఉద్యోగాలు కావాలనే నివేదిక తయారు చేసి, ప్రతి నెలా వెయ్యికి తగ్గకుండా ఉద్యోగాలు కల్పించేందుకు నిపుణ ఎన్జీఓ సమన్వయంతో ఎంప్లాయ్​మెంట్ సెల్ ను ప్రారంభిస్తున్నట్లు ఈటల ప్రకటించారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక కంపెనీలు ఉన్నాయని, వాటిల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగ రహిత నియోజకవర్గంగా తయారు చేస్తానని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా నర్సులు, ఇతర టెక్నికల్ ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఈటల పేర్కొన్నారు.

Advertisement

Next Story