Oyo Rules : పెళ్లికాని జంటలు ఓయోకు వెళ్తే తప్పేంటి?!

by Javid Pasha |
Oyo Rules : పెళ్లికాని జంటలు ఓయోకు వెళ్తే తప్పేంటి?!
X

దిశ, ఫీచర్స్ : ఓయో.. అతి తక్కువ సమయంలోనే ఆథిత్య రంగంలో ఆదరణ పొందిన లివింగ్ స్పేసెస్ అండ్ మల్టీనేషనల్ హాస్పిటాలిటీ చైన్ బిజినెస్ ఇది. లీజ్డ్, ఫ్రాంచైజ్డ్ హోటల్స్, హోమ్స్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. మన దేశంలోనూ చాలానే ఉన్నాయి. ఇక ఓయో పేరు వినగానే చాలా మంది అవి జంటలు తమ ప్రైవేటు సమయం గడిపేందుకు బుక్ చేసుకునే రూమ్స్ లేదా లాడ్జిగా భావిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఓయో సేవలు అందుబాటులోకి వచ్చాక పెళ్లి అయిందా.. కాలేదా? అనేదానితో సంబంధం లేకుండా 18 ఏండ్లు పైబడిన జంటలు ఎవరైనా ఓయోలో గడపే అవకాశం లభించింది. అందుకోసం జస్ట్ ఐడీ ప్రూఫ్ చూపెడితే చాలు.

ఎటువంటి కఠినమైన నిబంధనలు లేకపోవడంతో ఓయోకు ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే మేజర్లే కాకుండా ప్రేమలో పడిన మైనర్లు, పెళ్లయినప్పటికీ, అక్రమ సంబంధాలు పెట్టుకున్న జంటలు ఎక్కువగా ఓయోను ఆశ్రయించడం ఈ మధ్య కామన్ అయిపోయింది. అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు పెరుగుతున్నట్లు విమర్శలు, వివాదాలు రావడంతో ఇటీవల ఓయో కొత్త నిబంధనలు తెచ్చింది. ఇక నుంచి పెళ్లికాని జంటలకు ఓయో రూమ్స్ కేటాయించేది లేదని, ఆన్ లైన్‌‌లో బుక్ చేసుకునే అవకాశం కూడా లేదని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన మొత్తం దేశమంతటా కాదు. కేవలం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో మాత్రమే వర్తిస్తుంది. పరిస్థితిని బట్టి, చట్ట నిబంధనలను బట్టి దేశమంతా అమలు చేయాలో లేదో ఆలోచిస్తామని మాత్రమే చెప్పింది. దీంతో ఓయో రూముల గురించి సోషల్ మీడియాలో తెగ డిస్కస్ నడుస్తోంది.

పెళ్లి అయిన వారు మాత్రమే అది కూడా మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తేనే ఓయోలో రూములు కేటాయిస్తామనే నిబంధన(Oyo Rules) కేవలం ఒకచోటే అయినా దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. రూములు కేటాయించడానికి, పెళ్లికి లింక్ ఎందుకు మేజర్లు అయితే చాలు పెళ్లి చేసుకోకుండా ప్రైవేటుగా గడిపితే తప్పేంటి? అనే సందేహాలు, ప్రశ్నలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు పెళ్లికాని జంటలు ఓయోలో లేదా ఇతర ప్రైవేటు ప్లేస్‌లలో, లాడ్జీల్లో గడపవద్దనే రూల్స్, చట్టాలు ఏమైనా ఉన్నాయా? అని కూడా ఆరా తీస్తున్నారు. కాగా నిపుణుల ప్రకారం అలాంటి చట్టాలేవీ మన దేశంలో లేదు. పెళ్లితో సంబంధం లేకుండా మేజర్లు అయిన ప్రతీ ఒక్కరూ ఓయోలో రూముల బుక్ చేసుకోవచ్చు. అంటే 18 ఏండ్లు నిండితే చాలు పెళ్లికాని జంటలు ఓయోలో ప్రైవేటుగా గడపవచ్చు. అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ లేదా హక్కులో భాగంగానే చట్టం పరిగణిస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అంటే పెళ్లికానంత మాత్రాన ఓయోలో లేదా ఇతర ఏ లాడ్జీల్లో అయినా గడపకూడదనే చట్టపరమైన నిబంధనలేవీ ప్రస్తుతానికైతే మన దేశంలో లేవు. దీంతో ‘పెళ్లికాని జంటలు ఓయోకు వెళ్తే తప్పేంటి?’ అంటున్నారు కొందరు.

Advertisement

Next Story