ఆదాయంపై GHMC నజర్.. ఎస్టేట్ విభాగంపై ఫుల్ ఫోకస్

by Bhoopathi Nagaiah |
ఆదాయంపై GHMC నజర్.. ఎస్టేట్ విభాగంపై ఫుల్ ఫోకస్
X

దిశ, సిటీబ్యూరో : అప్పుల ఊబిలో చిక్కుకున్న జీహెచ్ఎంసీ(GHMC) ఆదాయం పెంచుకోవడానికి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ చిన్న అవకాశాన్నైనా ఉపయోగించుకోవడానికి కసరత్తు చేస్తోంది. ఆస్తి పన్ను (Property tax)ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి జీఐఎస్ సర్వే(GIS survey) చేపట్టిన విషయం తెలిసిందే. దీంతోపాటు జీహెచ్ఎంసీ ఎస్టేట్ విభాగానికి (GHMC Estate Division) చెందిన మోడల్ మార్కెట్లు(Model markets), షాపింగ్ కాంప్లెక్సులు(Shopping complexes), మార్కెట్లకు సంబంధించిన వివరాలు సేకరించి వాటికి జియో ట్యాగింగ్(Geo tagging) చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి జీహెచ్ఎంసీ అధికారులు ఎస్టేట్ విభాగంపై ఫోకస్ పెట్టారు.

ఏడాదికి రూ.6కోట్లు..

జీహెచ్ఎంసీ పరిధిలోని మున్సిపల్ కాంప్లెక్సులు(Municipal Complexes), మున్సిపల్ మార్కెట్లు(Municipal markets), మోడల్ మార్కెట్ల(Model markets) ద్వారా ఏడాదికి రూ.6కోట్ల ఆదాయం రాబట్టుకోవాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో మోడల్ మార్కెట్లు 635 ఉన్నాయి. 127 మార్కెట్లను అద్దెకిచ్చారు. 154 మోడల్ మార్కెట్లను ఆయా ప్రభుత్వ విభాగాలు, జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆఫీసులు, ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నారు. 354 ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్ కాంప్లెక్కులు 761 ఉన్నాయి. వీటిలో 525 అద్దెకిచ్చారు. 95 కాంప్లెక్సులను ప్రభుత్వ విభాగాలు వినియోగించుకుంటున్నాయి. 119 ఖాళీగా ఉన్నాయి. మార్కెట్లు 2,518 ఉన్నాయి. వీటిలో 1,834 అద్దెకిచ్చారు. రెండింటిని మాత్రమే ప్రభుత్వ విభాగాల ఆధీనంలో ఉన్నాయి. 446 ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది రూ.6కోట్ల టార్గెట్‌కు గాను ఇప్పటి వరకు రూ.3కోట్లు మాత్రమే వసూలైంది. మరో రూ.3కోట్లు రావాల్సి ఉంది.

డీసీలకు రిమైండర్లు..

నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మున్సిపల్ కాంప్లెక్సులు, మున్సిపల్ మార్కెట్లు, మోడల్ మార్కెట్లలో ఖాళీగా ఉన్న స్టాళ్లను, మలిగీలను గుర్తించి వెంటనే టెండర్లు చేపట్టి, అద్దెలకు కేటాయించాలని ఎస్టేట్ విభాగం నగరంలోని 30 సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. కానీ వివిధ కారణాలతో డిప్యూటీ కమిషనర్లు వీటికి టెండర్ల ప్రక్రియను చేపట్టలేదు. ఇంతకు ముందు ఓటరు జాబితా తయారు చేయడం, శానిటేషన్ స్పెషల్ డ్రైవ్, ప్రస్తుతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో నిమగ్నమై ఉండటంతో టెండర్ల ప్రక్రియ చేపట్టలేదు. అయితే సర్వే పూర్తికాగానే ఖాళీగా ఉన్న అన్ని కేటగిరీల షాపులకు మరో టెండర్లు నిర్వహించాలని కమిషనర్ ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (ఎస్టేట్) కొద్ది రోజుల క్రితం మరోసారి డిప్యూటీ కమిషనర్లకు రిమైండర్లను పంపినట్లు సమాచారం.

ఆదరణ కరువు..

ప్రజలకు అందుబాటులో లేకపోవడం, వ్యాపారానికి అనుగుణంగా లేకపోవడంతో కొన్ని సర్కిళ్లలో జీహెచ్ఎంసీకి చెందిన మున్సిపల్ మార్కెట్లు, మున్సిపల్ కాంప్లెక్సులు, మోడల్ మార్కెట్‌లలోని స్టాళ్లు, మలిగీలకు ఆదరణ కరువైంది. దీంతో దీర్ఘకాలికంగా ఖాళీగానే ఉంటున్నాయి. మున్సిపల్ కాంప్లెక్సులు, మోడల్ మార్కెట్లు, మున్సిపల్ మార్కెట్లు ఎక్కువ సంఖ్యలో గోషామహాల్, ఉప్పల్, కాప్రా, చార్మినార్, అబిడ్స్ తదితర సర్కిళ్లలో ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed