Elon Musk: ఒక్కరోజులోనే ఎలా లెక్కించారు?.. భారత ఎన్నికల ప్రక్రియపై మస్క్ ప్రశంసలు

by Shamantha N |
Elon Musk:  ఒక్కరోజులోనే ఎలా లెక్కించారు?.. భారత ఎన్నికల ప్రక్రియపై మస్క్ ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి, జార్ఖండ్ లో ఇండియా కూటమి విజయకేతనం ఎగురవేశారు. కాగా.. భారత ఎన్నికల ప్రక్రియపై టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ప్రశంసలు కురిపించారు. అమెరికా (USA)లోని కాలిఫోర్నియా (California)లో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ఆయన పోస్ట్‌ చేశారు. ‘భారతదేశంలో ఒక్క రోజులోనే 640 మిలియన్ల (64 కోట్ల) ఓట్లను ఎలా లెక్కించారు?’ అనే హెడ్‌లైన్‌తో ప్రచురితమైన ఓ స్టోరీని ఆయన షేర్ చేశారు. దానికి సుదీర్ఘ ట్యాగ్ లైన్ ని కూడా జతచేశారు. ‘భారత్‌ ఒక్క రోజులోనే ఇన్ని ఓట్లను లెక్కించింది. కానీ, కాలిఫోర్నియా ఇంకా ఓట్ల లెక్కింపులోనే ఉంది’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ కాస్త వైరల్‌గా మారింది.

అమెరికా ఎన్నికలు

ఇకపోతే, ఈ నెల 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) విజయం సాధించినట్లు ప్రకటించారు. అయినప్పటికీ, కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తికాలేదు. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కాలిఫోర్నియా. ఆ ప్రాంతంలో మెయిల్‌ ద్వారా పోలైన ఓట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో అవి లెక్కించేందుకు ఎక్కువ సమయం పడుతోంది. ఇప్పటికే 98 శాతం కౌంటింగ్‌ పూర్తయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 54 ఎలక్టోరల్‌ ఓట్లను డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ (Kamala Harris) ఆ ప్రాంతం నుంచి సాధించారు.

Advertisement

Next Story

Most Viewed