- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jharkhand Elections: జార్ఖండ్ ఎన్నికల్లో విక్రమార్కుడి వ్యూహాలు
దిశ, తెలంగాణ బ్యూరో: జార్ఖండ్ లో ఇండియా కూటమి విజయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీ రోల్ పోషించారు. క్షేత్రస్థాయి నుంచి స్టేట్ వరకు ఎన్నికల మానిటరింగ్ బాధ్యతలను తన భుజాలపై వేసుకొని వర్క్ చేశారు. ఒక వైపు తెలంగాణలో ప్రభుత్వం పథకాల అమలు, వివిధ అంశాలపై అధికారులతో రివ్యూలు చేస్తూనే.. మూడుసార్లు జార్ఖండ్ కు వెళ్లారు. దాదాపు పది రోజులపాటు ఎన్నికల కోసం వర్క్ చేశారు. ఇది కూటమి విజయానికి దోహదపడిందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. జార్ఖండ్ లో జేఎంఎం కూటమి 56 స్థానాల్లో గెలవగా, మెజార్టీ సీట్లలో డిప్యూటీ సీఎం తన పదునైన ఎన్నికల వ్యూహాలను ఇంప్లిమెంట్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సీఎం మొదలుకొని మెజార్టీ కేబినెట్ మంత్రులు వెళ్లగా, జార్ఖండ్ లో కేవలం డిప్యూటీ సీఎం ప్రచారం చేయడం గమనార్హం. ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడిగా, స్టార్ క్యాంపెయినర్ గా డిప్యూటీ సీఎం తీవ్రంగా శ్రమించారని, జార్ఖండ్ విజయంలో భట్టి పాత్ర మరువలేనిదని ఏఐసీసీ అగ్రనేతలంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. రాబోయే దేశ వ్యాప్త ఎన్నికల్లోనూ మరింత మెళకువుగా పనిచేసి రాహుల్ ను పీఎంగా చేయాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్ని రాష్ట్రాల నేతలకు సూచించారు.
రెండు అంశాలపై క్లారిటీతో
‘రాజ్యాంగ పరిరక్షణతోపాటు స్థానిక మైనింగ్, ఇతర వనరులు స్థానికులకే దక్కాలి’ అనే రెండు అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ఏఐసీసీ అధిష్టానం బాధ్యతలు అప్పగించడమే తరువాయి.. డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతల్లో ఉన్నా.. వెంటనే జార్ఖండ్ కు వెళ్లారు. మొదటి దశలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్ జేడీ మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటులో కీలక భూమిక పోషించారు. వివాదాలకు తావు లేకుండా సీట్ల పంపకం, ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. అభ్యర్థుల ఖరారు తర్వాత జార్ఖండ్ పీసీసీ, సీనియర్ నేతలను సమావేశపరిచి ఎన్నికల ప్రచారం, ఇతర అంశాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలో సూచించారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, ఇతర నాయకులతో కలిసి భట్టి మేనిఫెస్టో రూపొందించారు. ఆ తర్వాత రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రచార షెడ్యూల్, ప్రచారంలో పాల్గొనవలసిన ఇండియా కూటమి నేతల జాబితా ఖరారు వంటి పనులు విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం విస్తృత ప్రచారం చేపట్టారు.. భారీ బహిరంగ సభల కన్నా బ్లాక్ స్థాయి సభలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.
ఏడు గ్యారంటీలపై..
ఇంటింటికి మేనిఫెస్టో, ఏడు గ్యారంటీల్లోని అంశాలపై ఎక్కడికి అక్కడ నాయకులకు భట్టి శిక్షణ ఇచ్చారు. ఓ వైపు సభలు నిర్వహిస్తూ, మరోవైపు ఇండియా కూటమి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థిని సమన్వయపరిచారు. రాంచి కేంద్రంగా మకాం వేసి తెరవెనక యంత్రాంగం నడిపిస్తూ, భట్టి క్రియాశీలకంగా పనిచేశారు. జార్ఖండ్ రాష్ట్రంలో అంతరాలు తొలగి, అందరికీ సమాన హక్కులు, రాజ్యాంగ పరిరక్షణకు ఇండియా కూటమి విజయం మాత్రమే మార్గమని స్థానిక లీడర్లకు నొక్కిచెప్పారు. అంతేగాక జార్ఖండ్ లోని అపారమైన ఖనిజ సంపదపై బీజేపీ కన్ను పడిందని, దీన్ని అదాని, అంబానీ వంటి క్రొనీ క్యాపిటలిస్టుల చేతిలో పెట్టేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రయత్నం చేస్తున్నదని వివరించారు. రాష్ట్ర ఖనిజ వనరులు, సంపద జార్ఖండ్ వాసులకు దక్కాలంటే కాంగ్రెస్ కూటమిని గెలిపించాలంటూ ప్రజల మెదళ్లలో బలంగా నాటారు. ఈ రెండు అంశాలు స్థానికులను ఆలోచింపచేయగా, ఇండియా కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది.
జార్ఖండ్ కు చేరుకున్న భట్టి విక్రమార్క
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎన్నికల అబ్జర్వర్ గా నియమించగా, శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో జార్ఖండ్ వెళ్లారు. వెంటనే స్థానిక కాంగ్రెస్ నేతలతో సమావేశమై ఫలితాలను విశ్లేషించారు. ఇండియా కూటమి విజయం ఖరారు కావడంతో.. జార్ఖండ్ ముక్తి మోర్చా నేత, సీఎం సోరేన్ ఇంటికి కీలక నేతలతో కలిసి వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆదివారం గెలుపొందిన ఎమ్మెల్యేలతో ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు.