ఆర్ఓబీ నిధులు రూ.15 కోట్లను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది

by Sridhar Babu |
ఆర్ఓబీ నిధులు రూ.15 కోట్లను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది
X

దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఓబీ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్ద కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ చేసిన 15 కోట్ల నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూరు మండలంలోని అడవి మామిడిపల్లి వద్ద ఆర్ఓబీ 802 పనులను, ఆర్మూర్ మున్సిపల్ లోని మామిడిపల్లిలో గల 773 పనులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఓటుకు 5000 రూపాయలను

మాజీ ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశాడని ఆరోపించారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలను భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తే ఆహ్వానిస్తానన్నారు. లిక్కర్ కేసులో ఇందూర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వచ్చిన ఆరోపణలు నిజమైతే తప్పకుండా జైలుకు పంపిస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న ఆర్ఓబీ పనులపై రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి త్వరలోనే కలుస్తామన్నారు. హిందువులపై కామెంట్లు చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని

అయోధ్య నిర్మాణం కోసం వేచి చూసేలా తల పొగరు దించామన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. కాగా ప్రశ్నల వర్షం కురిపించిన మీడియాపై ఎంపీ అరవింద్ దురుసుగా ప్రవర్తించారు. అన్ని ప్రశ్నలు వేసే బదులు మీరే వచ్చి సమాధానం చెప్పండి అంటూ మీడియాపై ఎంపీ రుసరుసలాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు పల్లె గంగారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed