న్యూ ఇయర్ జోష్.. అంబరాన్నంటిన సంబురాలు..

by Sumithra |
న్యూ ఇయర్ జోష్.. అంబరాన్నంటిన సంబురాలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి న్యూ ఇయర్ హంగామా కనిపించింది. ప్రజానీకం 2024కి బైబై చెబుతూ...2025 కి ఘన స్వాగతం పలికారు. యువత ఆట, పాటలతో స్టెప్పులేస్తూ హోరెత్తించింది. ఎక్కవ చూసినా కేక్ లు కట్ చేస్తూ... పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడమే కనిపించింది. ఇక వివిధ వ్యాపార వర్గాలు స్పెషల్ ఆఫర్లతో ఆకట్టుకోగా, కాసుల వర్షం కురిసింది. పోలీసు శాఖ పెట్రోలింగ్ చేస్తూ.. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా మంగళవారం ఎక్పైజ్, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది, మరో పక్క టాస్క్ ఫోర్స్ పోలీసులు అలుపెరగకుండా రాత్రంతా తనిఖీలు నిర్వహించారు. ఇందుకోసం ఎక్కువ మొత్తంలో సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి తనిఖీలకు పురమాయించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్‌స్ లో భాగంగా మధ్యం తాగి వాహనాలు నడిపే వారి కారణంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో వాటి ప్రమాదాల నివారణకు కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రాత్రంతా నేషనల్ హైవే పై పెట్రోలింగ్ వాహనాలతో పోలీసు బృందాలు అలర్ట్ గా ఉన్నాయి. మధ్యం మత్తులో, న్యూ ఇయర్ జోష్ లో అక్కడక్కడా అత్యుత్సాహంతో గొడవలు జరగడం, కొట్లాటలు శృతిమించిన పోకిరీ చేష్టలు కూడా ఉంటాయనే ఉద్దేశంతో పోలీసులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్త పడాలని ఓపక్క పోలీసులు ప్రజలకు సూచిస్తూనే మరో పక్క పోలీసులు కూడా నేషనల్ హైవేపైన, బీజీ రోడ్ల పైన పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అనుమతుల్లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్ లు ఎక్కడైనా జరిగితే యాక్షన్ తీసుకోవడానికి ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖలు వేర్వేరుగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అనుమతుల్లేకుండా ఏ ఈవెంట్స్ జరిగినా, సెలబ్రేషన్స్ జరిగినా కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు, ఎక్కైజ్ అధికారులు తెలిపారు. 31 డిసెంబర్ సందర్భంగా ప్రభుత్వం లైసెన్సుడ్ మధ్యం షాపుల్లో మధ్యం అమ్మకాలకు ప్రభుత్వం అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతినిచ్చింది. అలాగే బార్ లకు కూడా అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతినిచ్చింది. ఇవే కాకుండా ఉమ్మడి జిల్లా అంతటా గ్రామీణం, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ న్యూ ఇయర్ జోష్ ఉండటంతో పోలీసులు నానా హైరానా పడుతూ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం అన్ని మధ్యం షాపులు రాత్రి 12 గంటల వరకు, బార్లు రాత్రి ఒంటి గంట వరకు మందు ప్రియులతో కళకళలాడుతుంటాయి.

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పటిష్టం...

ఉమ్మడి జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దు, కర్నాటక సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టుల వద్ద ఎక్సైజ్ పోలీసులు పెద్ద యెత్తున నిఘాను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి మధ్యం స్టాక్ జిల్లాలకు రాకుండా కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారులు చెపుతున్నారు. నాలుగైదు రోజులుగా నిఘా ఉన్నప్పటికీ మంగళవారం మరింత సీరియస్ ఫోకస్ పెట్టారు. దీనికి తోడు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా అనుమతులు లేకుండా న్యూ ఇయర్ ఈవెంట్స్ జరుపుకుంటున్నా, ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకుని న్యూఇయర్ జోష్ పార్టీలు చేసుకుంటున్నా రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఎక్సైజ్ శాఖలో ఉన్న అన్ని స్థాయుల అధికారులు ఫీల్డ్ లోనే ఉన్నారు. తమకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చినా రైడ్ చేసి కేసులు నమోదు చేయడానికి అధికారులు, సిబ్బంది రెడీగా బృందాల వారీగా జిల్లా అంతటా విస్తరించి ఉన్నారు. రాత్రంతా తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటామని రెండు జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు దిశకు తెలిపారు.

తెలంగాణాలో కన్నా మహారాష్ట్రలో తక్కువ ధరకు లిక్కర్ , దేశీదారు లభ్యం కావడంతో సరిహద్దు ప్రాంతాల వారు మహారాష్ట్ర దేశీదారు, చీప్ లిక్కర్ తో పాటు తక్కువ ధరకు లభ్యమయ్యే మధ్యం బాటిళ్లను ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఈ కారణంగా తెలంగాణాకు వచ్చే రెవెన్యూకు నష్టం జరిగే అవకాశాలుండటంతో అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే మధ్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది బృందం నాలుగైదు రోజులుగా చెక్ పోస్టుల వద్ద నిఘాపెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రంతా దాదాపు నాలుగైదు బృందాలు బోధన్ మండలం సాలూర చెక్ పోస్టు వద్ద నిరంతరాయంగా తనిఖీలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో మద్నూర్ మండలం సలాబత్ పూర్ చెక్ పోస్టులోనూ ఎక్సైజ్, పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

అంకాపూర్ చికెన్ సెంటర్ యమ బిజీ..

జిల్లాల్లో అంతటా పరిచయం అక్కర్లేని పేరు అంకాపూర్ చికెన్. న్యూ ఇయర్ సందర్భంగా అంకాపూర్ లోని చికెన్ సెంటర్లకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయని, సప్లయ్ కోసం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని అంకాపూర్ చికెన్ ప్రియులకు ఇబ్బందులు కలగకుండా సప్లయ్ చేస్తున్నట్లు వ్యాపారులు చెపుతున్నారు. తోటల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసుకున్న విందు పార్టీలకు కూడా చికెన్ వ్యాపారులు డోర్ డెలివరీ ఇస్తున్నారు. 31 డిసెంబర్ రోజు ఉండే డిమాండ్ ను ఊహించే రెండు రోజుల ముందే వందల సంఖ్యలో నాణ్యమైన దేశీ కోళ్ల తెప్పించి రెడీగా ఉంచినట్లు వ్యాపారులు చెపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed