నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పై అవిశ్వాసం?

by Sridhar Babu |
నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పై అవిశ్వాసం?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావుకు పదవీ గండం ఏర్పడింది. జెడ్పీ చైర్మన్ ను గద్దె దింపేందుకు సొంత పార్టీ జెడ్పీటీసీ పావులు కదుపుతున్నారు. ఆదివారం కొందరు జెడ్పీటీసీలు సమావేశమై అవిశ్వాసం పై సోమవారం జిల్లా కలెక్టర్ కు నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 15న జరిగిన జిల్లా పరిషత్ అర్థిక ప్రణాళిక సంఘం సమావేశంలోనే చైర్మన్ పై అవిశ్వాసానికి బీజం పడింది. ఈ నెల 21న ఆర్మూర్ లో ఈ విషయంపై జెడ్పీటీసీలు సమాలోచనలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లి ఎన్నికలకు ముందే విఠల్ రావుపై అవిశ్వాసంపై జిల్లా కేంద్రంలోని స్టార్ హోటల్ లో సమావేశం అయ్యారు. కానీ ప్రభుత్వం బదనాం అవుతుందని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెలువడుతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డు చెప్పడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. అసెంబ్లీ ఎన్నికలలో ఆరు స్థానాలకు గాను నలుగురు ఎమ్మెల్యేలు ఓటమి పాలైన విషయం తెలిసిందే.

దాంతో జెడ్పీటీసీలు ఏకమై విఠల్ రావును ఎలాగైనా గద్దె దింపాలని నిర్ణయించినట్లు తెలిసింది. జెడ్పీటీసీల పదవీకాలం ఇంకా మూడునాలుగు నెలలు ఉంది. కానీ ఒక్కసారైనా జెడ్పీ చైర్ పర్సన్ కావాలనుకున్న ఓ మహిళా నేత ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా పరిషత్ లో 27 మంది సభ్యులు ఉంన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా దాదన్న గారి విఠల్ రావు పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత చాలామందికి ఆయనంటే పడనే లేదు. తొలుత జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ధర్పలి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆశించినా సీఎం కేసీఆర్​ దూరపు బంధువు విఠల్ రావుకు కట్టబెట్టారు. కానీ తన ప్రమేయం లేకుండా తన నియోజకవర్గం నుంచి జెడ్పీ చైర్మన్ గా విఠల్ రావును ఎంపిక చేయడం ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నచ్చలేదు. కానీ ఆనాడు అధికారంలో ఉన్న నేతల ఆదేశాల మేరకు అందరూ సైలెంట్ అయ్యారు. కానీ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికైన తరువాత విఠల్ రావు సొంత పార్టీ వారికే ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయం ఉంది.

అంతే కాకుండా నిధుల విడుదలో కూడా వివక్ష చూపారని ఆరోపణలున్నాయి. అప్పుడు జిల్లాలో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటంతో వారు కూడా స్థానిక సంస్థల అధికారం విషయంలో జోక్యం చేసుకోలేదు. పలు మార్లు జిల్లా పరిషత్ సభ్యులకు గౌరవం దక్కలేదని ప్రోటోకాల్ విషయంలో గోడవలు జరిగినా వాటిని ఎమ్మెల్యేలు సద్ధుమనిపించారు. నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లి ఎన్నికలలో ఓటమి పాలైన తరువాత బీఆర్ఎస్ కు జిల్లాలో గడ్డు కాలం మొదలైంది. మరో కొన్ని నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమౌతున్న వేళ ఒకొక్క స్థానిక సంస్థలపై బీఆర్ఎస్ పార్టీకి పట్టు సడలిపోతుంది. దాంతో వారు ఇప్పుడు అసమ్మతి పాట పాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోదన్ బల్ధియా చైర్ పర్సన్ తుము పద్మావతి ఆనాటి అధికార పార్టీ ఎమ్మెల్యే షకిల్ అమేర్ పై తిరుగుబాటుతో ఈ ప్రక్రియ విజయవంతంగా ప్రారంభమైందని చెప్పాలి. అక్కడ ఇప్పుడు బల్ధియా పాలకవర్గం ఉన్నా

అది ఏపార్టీ వారు అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కామారెడ్డి మున్సిపాల్టీలోనూ ఉంది. అక్కడ వైస్ చైర్మన్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అక్కడ అవిశ్వాస ప్రక్రియ త్రిశంకు స్వర్గంలో ఉంది. అసెంబ్లి ఎన్నికల తరువాత అధికార బీఆర్ఎస్ చైర్ పర్సన్ పండిత వినీతపై ఆర్మూర్ బల్ధియా పాలకవర్గం అవిశ్వాసం పెట్టి గద్దె దింపారు. నిజామాబాద్ మేయర్ పై అవిశ్వాస కత్తి వేలాడుతుండగానే, నిజామబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ను గద్దె దించేందుకు చకచకా పావులు కదులుతున్నారు. మరో మూడు నాలుగు నెలల పదవీ కాలం ఉన్నా జెడ్పీ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టించి నెగ్గుతారా లేదా అనేది వెచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed