ఇండ్లలోకి చేరిన నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు..

by Sumithra |
ఇండ్లలోకి చేరిన నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు..
X

దిశ, నిజాంసాగర్ : అసలే వర్షాలు లేక రైతులందరూ నీటి కోసం నానా తిప్పలు పడుతుంటే ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిజాంసాగర్ నీటిని నాట్లు వేయడానికి ప్రధాన కాలువ ద్వారా ఆదివారం రోజు నీటిని విడుదల చేపించారు. కానీ ఆ కాలువను పరిశీలించే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. పూర్తివివరాల్లోకి వెళితే మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో నిజంసాగర్ ప్రాజెక్టు నుండి విడుదల చేసిన నీటిని అధికారులు పరిమితికి మించి డిస్ట్రిబ్యూటర్ ద్వారా నీటిని విడుదల చేయడంతో ఇళ్లలోకి నీరు చేరింది. ఇలాంటి ఘటనలు గతంలో చాలా సార్లు జరిగాయి. అప్పుడు అధికారులు వచ్చి కెనాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తీసేస్తామని చెప్పి మరమ్మతులు చేస్తామని చేతులు దులుపుకున్నారు. మళ్ళీ ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వలన ఇళ్లల్లోకి నిజంసాగర్ నీరు మళ్ళీ చేరాయి.

అసలే ప్రాజెక్టులో నీరు తక్కువ ఉండడం వలన పొదుపుగా వాడుకోవాలని నీటిని వృధా చేయొద్దని ఆదివారం జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా అధికారులు మాకేం సంబంధం లేనట్టు వ్యవహరించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి గాలిపూర్ గ్రామస్తులు గతంలో చాలాసార్లు జలవనరుల శాఖ కార్యాలయం చుట్టూ తిరిగిన కార్యాలయంలో ఒక్కరు కూడా అందుబాటులో లేరని ప్రజలు తెలిపారు. ఇప్పుడైనా అధికారులు కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు తెలుపుతున్నారు.

Next Story

Most Viewed