Stock Market: స్టాక్ మార్కెట్లలో యుద్ధ భయాలు.. రూ. 11 లక్షల కోట్లు ఆవిరి

by S Gopi |
Stock Market: స్టాక్ మార్కెట్లలో యుద్ధ భయాలు.. రూ. 11 లక్షల కోట్లు ఆవిరి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లలో యుద్ధ మేఘాలు ఆవరించాయి. గతవారం వరకు వరుస రికార్డు స్థాయిలతో దూసుకెళ్లిన సూచీలకు గురువారం ట్రేడింగ్ అంతే స్థాయిలో పతనం ఎదురైంది. ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయెల్‌కు మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం కారణంగా మధ్య ప్రాచ్యంలో పరిస్థితులపై మదుపర్లు ఎక్కువ అప్రమత్తంగా వ్యవహరించారు. యుద్ధ తీవ్రత పెరిగిన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. క్రూడ్ ధర బ్యారెల్‌కు గురువారం 75 డాలర్లకు పెరిగింది. ఇదే సమయంలో దేశీయంగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎఫ్అండ్ఓ ట్రేడింగ్ నిబంధనలను కఠినతరం చేయడంతో మార్కెట్లలో ఒత్తిడి కనిపించింది. ఇటీవల చైనా ప్రభుత్వం ఉద్దీపన ప్రకటనలు చేయడంతో అక్కడి మార్కెట్లలో ర్యాలీ సాగుతోంది. దీనివల్ల విదేశీ పెట్టుబడులు భారత్‌కు రావడం తగ్గిపోతాయనే ఆందోళనలు కూడా దేశీయ ఈక్విటీలపై ప్రభావం చూపించాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,769.19 పాయింట్లు కుదేలై 82,497 వద్ద, నిఫ్టీ 546.80 పాయింట్లు పతనమై 25,250 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ రంగం ఏకంగా 4 శాతం మేర క్షీణించింది. ఆటో, ఫైనాన్స్, బ్యాంకింగ్, మీడియా రంగాలు 2 శాతానికి పైగా బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని షేర్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్, మారుతీ సుజుకి, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు అత్యధికంగా 3-4 శాతం మధ్య నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 84 వద్ద ఉంది.

రూ. 11 లక్షల కోట్లు హాంఫట్..

గురువారం స్టాక్ మార్కెట్ల పతనం 2024 ఏడాదిలో మూడవ అతిపెద్ద సింగిల్ డే లాస్‌గా నమోదైంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువైన జూన్ 4న సెన్సెక్స్ ఇండెక్స్ అత్యధికంగా 4,390 పాయింట్లతో భారీ క్షీణతను చూసింది. ఆ తర్వాత ఆగష్టు 5న 2,223 పాయింట్లు పడిపోగా, దీని తర్వాత గురువారం నాటి నష్టాలు మూడో అత్యధికంగా ఉన్నాయి.అంతకుముందు జనవరి 17 న సెన్సెక్స్ 1,628 పాయింట్లు పడిపోయింది. అలాగే.. జనవరి 23, మే 9, సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 30 తేదీల్లో 1,000 పాయింట్లకు పైగా క్షీణించిన ఇతర సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల మదుపర్లు ఒక్కరోజే రూ.10.7 లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 465 లక్షల కోట్లకు చేరింది.

Next Story

Most Viewed