కేసీఆర్ నిర్ణయంతో మీ సేవా కేంద్రాల్లో సందడి

by Mahesh |
కేసీఆర్ నిర్ణయంతో మీ సేవా కేంద్రాల్లో సందడి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు మాదిరిగానే కుల వృత్తులపై ఆధారపడిన బడుగు, బలహీన వర్గాల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసేందుకు ఇటీవల ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు కుల, ఆదాయ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో దానికోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉండటంతో చాలా మంది మీ సేవా కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి.దీంతో మీ సేవ కేంద్రాలు రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్నాయి.

కుల,ఆదాయం సర్టిఫికెట్లతో రూ.45 రుసుంతో అప్‌లోడ్ చేస్తుండగా మీ సేవా కేంద్రాలు బిజీగా మారాయి. ఒక్కొక్క దరఖాస్తుకు 30 నిమిషాల వరకు సమయం పడుతుండడంతో మీ సేవ వద్ద జనం బారులు తీరుతున్నారు.కుల,ఆదాయం సర్టిఫికెట్లు కోసం దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తుండడంతో సర్వర్ డౌన్ అవుతున్నాయి. దీంతో దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా రెవెన్యూ శాఖలో సర్వర్ల డౌన్ అని వస్తుందని తహసీల్దార్ తో చెబుతున్నారు.

ముప్పుతిప్పలు పడుతున్న దరఖాస్తుదారులు

మీ సేవా కేంద్రాల మాదిరిగానే తహసీల్దార్ కార్యాలయాలకు సర్టిఫికెట్ల కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పటికే గతంలో తెలంగాణ ప్రభుత్వ హయంలో వచ్చిన కులం సర్టిఫికెట్‌ను పరిగణలోకి తీసుకుంటున్న ఆదాయంకు వచ్చే సరికి ఖచ్చితంగా ఆరు నెలల కాలానికి సంబంధించినదే పరిగణలోకి తీసుకుంటుండడంతో పెద్ద ఎత్తున వాటికి సంబంధించిన దరఖాస్తులే వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ఈ తాకిడితో విద్యార్థులకు ఇతర సర్టిఫికెట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. కుల వృత్తులపై ఆధారపడిన బీసీ ఏ, బీ, డీలోని కులాల వారికే ఆర్థిక చేయూత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆయా గ్రూప్‌లలో ఉన్న పేదలు దరఖాస్తులకు ముప్పతిప్పలు పడుతున్నారు.

లబోదిబోమంటున్న లబ్ధిదారులు

ఆధార్ కార్డు తో పాటు రేషన్ కార్డు ఉండాలని, దివ్యాంగుల లైతే సదరం సర్టిఫికెట్, పాన్ కార్డు ఉంటే దాని వివరాలు, బ్యాంక్ అకౌంట్ అంటూ నిబంధనలు పెడుతూ కొత్త ఖాతాలు తెరిచేందుకు ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుల వృత్తులపై ఆధారపడిన వారికి లక్ష రూపాయల ఆర్థిక చేయూత పథకం కోసం ఎక్కడ దరఖాస్తులు సమర్పించాలో తెలియక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రెవెన్యూ శాఖ కేవలం సర్టిఫికెట్ల జారీ కే పరిమితం కాగా మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లలో దరఖాస్తులు తీసుకోవడం లేదు. బీసీ కార్పొరేషన్ లోనే దరఖాస్తులు సమర్పించాలని చెబుతున్నారు.

మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో సర్టిఫికెట్ల దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. కుల వృత్తులపై ఆధారపడిన వారికి ఆర్థిక చేయూతను అందించే పథకానికి సంబంధించిన విధివిధానాలు కానీ, ఎంపిక ప్రక్రియ ఎవరి ద్వారా జరుగుతుందనేది ఇప్పటికి స్పష్టంగా లేదు. దళిత బంధు మాదిరిగా ఎంపిక ప్రక్రియ స్థానిక ఎమ్మెల్యేలకు ఇస్తారని ప్రచారం జరుగుతుండగా అధికారులు మాత్రం నిర్ధారించలేదు.

Advertisement

Next Story

Most Viewed