జీవన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోండి

by Sridhar Babu |   ( Updated:2023-11-03 13:05:01.0  )
జీవన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోండి
X

దిశ, ఆర్మూర్ : ఆశన్న గారి జీవన్ రెడ్డిని మరో మారు ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిపించుకోండని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. మీ బిడ్డ జీవన్ రెడ్డి ఎక్కువగా హైదరాబాదులో నాతోనే ఉంటాడని, మీ ఆర్మూర్ ప్రాంత ప్రజల కోసం ఏ అవసరం వచ్చినా నాతో కొట్లాడి తీసుకుంటాడని, నేను ఇయ్యని పక్షంలో నాతో అలిగైన మీకోసం పనులు చేయించికెళ్లే మొండోడు అని సీఎం కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల సిద్దుల గుట్ట వెనకాల దోబీ ఘాట్, ఆలూరు బైపాస్ రోడ్డులో గల ఓ ప్రైవేట్ వెంచర్లో శుక్రవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మీ ప్రాంతంలోని అంకాపూర్ రైతులు అభ్యుదయ రైతులన్నారు. అంకాపూర్ గురించి ఈ ప్రపంచంలోనే నా అంతగా ఎవరూ ప్రచారం చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అంకాపూర్ రైతులు క్రమశిక్షణతో అభ్యుదయ పద్ధతులతో వ్యవసాయం చేస్తారన్నారు.

అంకాపూర్ రైతులను స్ఫూర్తిగా తీసుకొని ఆర్మూర్ ప్రాంత రైతులందరూ పంటల సాగులో పోటీ తత్వంతో పంటలు పండిస్తూ ఆర్థికంగా సంపాదించుకున్నట్టు చెప్పారు. ఎలక్షన్లో ఎవడో వచ్చి ఏదో మాట్లాడుతున్నాడని, ప్రతిపక్ష నాయకులను ఉర్దేశించి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల చరిత్ర ఏంటో, ఏ పార్టీ ప్రజలకు ప్రయోజనం కలిగించిందో మీరు ఆలోచించి ఓటు వేయాలన్నారు. అభ్యర్థి ఏ పార్టీలో ఉన్నాడో ఆలోచించాలని, ఆ పార్టీ గతంలో చేసిన పనులేంటి, తెలుసుకొని ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఓటు అనేది మన కిస్మత్ ను నిర్ణయించేదని, ఓటు ద్వారా ప్రజలు ఐదేళ్లు పాలించే హక్కును పార్టీలకు ఇవ్వాలని, ఆ ఓటు వేసే ముందు పార్టీలు గతంలో చేసిన పనులను గుర్తు చేసుకుని ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏళ్లు పాలన చేసింది అన్నారు. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని, పదేళ్ల పనులలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం చేసిన పనులను ప్రజలు ఆలోచన చేసుకుని ఓటు వేయాలన్నారు. మీ ఆర్మూర్ ప్రాంత రైతాంగ బిడ్డ అయిన జీవన్ రెడ్డి కన్నా ముందు చాలా మంది ఎమ్మెల్యేలు ఆర్మూర్లో ఉండేవారని,

అప్పుడు ఏం జరిగింది అని, జీవన్ రెడ్డి హయాంలో ఏం జరిగిందో ప్రజలు ఆలోచన చేసి చర్చించుకోవాలన్నారు. బాల్కొండ నియోజకవర్గం లో తెల్లాందాక..పొద్దాక కరెంటు ఇచ్చే కాంగ్రెస్ రాజ్యం రావాలా? 24 గంటలు కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? రైతులు మనసుపెట్టి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవా లన్నారు. ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం వలె 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదన్నారు. తనని నరేంద్ర మోడీ బెదిరించి తెలంగాణలోని అన్ని మోటార్లకు మీటర్లు పెట్టమన్నారని తెలిపారు. పెట్టను ఏం చేసుకుంటావో చేసుకో అని రైతుల పక్షాన నరేంద్ర మోడీకి చెప్పినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, కరెంటు 24 గంటలు ఫ్రీగా ఇస్తున్నామని, రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం అన్నారు. రైతుల పంటల దిగుబడులను గిట్టుబాటు ధరలకు కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ధాన్యం కొంటే 10 రోజుల్లో మీ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయన్నారు. రైతు బీమా కూడా ఎవరి పైరవీ లేకుండా 5 లక్షల రూపాయలు రైతు మరణించిన వారి కుటుంబాలకు వస్తున్నాయన్నారు. మంచి ఆలోచనతో తానే ఈ రైతుబంధు పథకాన్ని రైతుల కోసం తీసుకొచ్చినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. 17 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటారని,ఏ ఒక్క రాష్ట్రం కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడం లేదన్నారు.

బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనన్నారు. భవిష్యత్తులో మన ప్రభుత్వం ద్వారా పింఛన్ దారులకు 5 వేలు ఇప్తామన్నారు. అందరికీ దళితబంధు అందేలా చూస్తా అన్నారు. రైతుబంధు ఉండాల్నా లేదా అని అడిగితే ప్రజలందరూ కావాలని కేకలతో బదులిచ్చారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసిందని, కాంగ్రెసోళ్లు మోసం చేస్తే తాను చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్ష మేరకు సాధించి పెట్టానని చెప్పారు. జై తెలంగాణ, కారు గుర్తుకే ఓటెయ్యండి అని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ఎర్ర జొన్నల ఉద్యమంలో అప్పట్లో జీవన్ రెడ్డి రైతుల కోసం ఆమరణ దీక్ష చేసి రాజకీయ

ఆరంగ్రేటం చేశాడని, ఉద్యమ సమయంలో ఆర్మూర్ ప్రాంతంలో ఉద్యమ ఉధృతికి జీవన్ రెడ్డి కృషి చేశాడు అన్నారు. ఆర్మూర్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన జన ప్రవాహాన్ని చూస్తేనే ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి గెలుపు ఖాయమేనని తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, రాజ్యసభ సభ్యులు కే ఆర్ సురేష్ రెడ్డి, దామోదర్ రావు, తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విటల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్నా, ఎంపీపీలు పస్క నరసయ్య, వాకిడి సంతోష్ రెడ్డి, మాస్త ప్రభాకర్, జెడ్పీటీసీలు మెట్టు సంతోష్, ఎర్రం యమునా ముత్యం, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story