ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలి

by Sridhar Babu |
ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలి
X

దిశ, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని చూస్తే కాంగ్రెస్ నాయకులు కోర్టుకు వెళ్లారన్నారు. ప్రస్తుత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు నాడు కేసీఆర్ ప్రజల రక్త మాంసాలు పీల్చి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారని అన్న మాటలు గుర్తు చేశారు. ఇప్పుడు అదే భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారని, ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం 20 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పేద, మధ్యతరగతికి చెందిన ప్రజలు ఇప్పటికే వేలాదిగా దరఖాస్తులు చేసుకున్నారన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 17500 మంది దరఖాస్తు చేసుకోగా రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల 45 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరి ద్వారా 20 వేల కోట్లు రాబట్టే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. 14 సంవత్సరాల పాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు ప్రజలు తమకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దేశంలోనే మేటి రాష్ట్రంగా కేసీఆర్ నిలబెట్టారని తెలిపారు. మాయమాటలు, తప్పుడు ప్రచారాలు, అసత్యపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి ఒక్కరూపాయి కూడా చేయలేదన్నారు. వృద్ధులు, వితంతువులకు పింఛన్ 4 వేలకు పెంచుతామని చెప్పినా అమలుకు నోచుకోలేదన్నారు. రైతుల కోసం రైతుబంధు ద్వారా గత ప్రభుత్వం ఏటా సకాలంలో 10 వేల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 3 ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు వేశారన్నారు. ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదని తెలిపారు.

మార్చి నెలలోనే కరెంట్ కోతలు మొదలయ్యాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎన్నికల మేమిఫెస్టోలో 420 హామీలిచ్చి ముఖ్యమైన హామీలే నెరవేర్చలేకపోతుందని విమర్శించారు. భవిష్యత్తులో హామీలు అమలు చేస్తుందన్న గ్యారెంటీ లేదన్నారు. పేద ప్రజలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాల్సిందేనని రేపు ఆర్డీఓ, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్, మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed