- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హర్యానాలో బీజేపీ రికార్డు.. ఫస్ట్ టైమ్ హ్యాట్రిక్ విజయం
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో బీజేపీ చరిత్ర సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో జేజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి సొంతంగా మెజార్టీ సీట్లు గెలుచుకుంది. వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు ఆమడదూరంలో నిలిచింది. పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్.. హర్యానాలో మాత్రం బోణీ కొట్టలేకపోయింది. బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించిన జేజేపీ ఖాతా తెరవలేకపోయింది. అక్టోబర్ 5వ తేదీన సింగిల్ ఫేజ్‌లో హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరగ్గా.. మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి.
హోరాహోరీగానే..
90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 45 సీట్లు అవసరం. బీజేపీ సొంతంగా 48 సీట్లు గెలచుకోగా.. కాంగ్రెస్ 37కు పరిమితమైంది. ఐఎన్‌ఎల్‌డీ రెండు సీట్లు గెలుచుకోగా.. ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. సీట్లు బీజేపీకి ఎక్కువ వచ్చినా.. ఓటింగ్ శాతం చూస్తే కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని అర్థమవుతుంది. 67.90 శాతం పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో బీజేపీకి 39.94 శాతం ఓటు షేర్ దక్కింది. కాంగ్రెస్‌కు 39.09 శాతం ఓటు షేర్ లభించింది. ఐఎన్ఎల్‌డీకి 4.14 శాతం వచ్చింది. ఆప్‌కు 1.79 శాతం ఓట్లు వెళ్లాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తోపాటుగా ఉన్న ఆప్.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సెపరేట్‌గా బరిలోకి దిగింది. ఆప్ ఇక్కడ కాంగ్రెస్ ఓట్లు చీల్చిందని, తద్వార కాంగ్రెస్ ఓటమికి కారణమైందనే విశ్లేషణలు వస్తున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఈ సారి తప్పాయి. కాంగ్రెస్ ఒంటరిగానే మెజార్టీకి ఎక్కువ సీట్లు గెలుస్తుందని, బీజేపీ 30కిలోపే సీట్లు గెలుచుకుంటుందని పేర్కొన్నాయి. వాస్తవ ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
ఈ ఫలితాలు అంగీకరించం:
కాంగ్రెస్ పార్టీ ఈ ఫలితాలను అంగీకరించబోమని ప్రకటించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని జైరాం రమేశ్ ఆరోపించారు. ‘మాకు చాలా తీవ్రమైన ఫిర్యాదులు అందాయి. కౌంటింగ్, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయి. కనీసం మూడు జిల్లాల్లో ఈవీఎంల తీరు సరిగా లేదు. హర్యానాలోని మా సీనియర్ నాయకులతో మాట్లాడుతున్నాం. సమాచారం సేకరించి ఈసీకి అందిస్తాం’ అని చెప్పారు. ‘హర్యానా ఫలితాలు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇది ప్రజా తీర్పును పక్కదారి పట్టించినట్టుగా ఉన్నది. ప్రజాస్వామిక ప్రక్రియనే అపహాస్యం చేసి గెలిచినట్టుగా ఉన్నది. ఈ ఫలితాలను మేం అంగీకరించం’ అంటూ ఆరోపణలు చేశారు. ఇది ప్రజల తీర్పు అని, అన్ని పార్టీలు తప్పకుండా శిరసావహించాలని బీజేపీ స్పష్టం చేసింది. ఈసీ వెబ్‌సైట్‌లో ఫలితాలు ఆలస్యంగా అప్‌డేట్ చేస్తున్నారని జైరాం రమేశ్ ఫిర్యాదు చేయగా.. ఈసీ తోసిపుచ్చింది. కాంగ్రెస్ ఆరోపణలు బాధ్యతారాహిత్యంగా, నిరాధారంగా ఉన్నాయని పేర్కొంది. వెబ్‌సైట్‌లో ఫలితాల నమోదులో ఆలస్యం జరిగిందని చెప్పడానికి కాంగ్రెస్ వద్ద ఆధారాలే లేవని, వారు సమర్పించిన మెమోరాండం కూడా ఎలాంటి ఆధారాలను పేర్కొనలేదని తెలిపింది.
జిలేబీ ఫ్యాక్టర్:
ఫలితాలు మొదటి రౌండ్స్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యత కనిపించింది. మెజార్టీ సీట్లల్లో హస్తం పార్టీనే ముందంజలో నిలవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. జిలేబీలు తెచ్చుకుని పంచుకుంటూ సంతోషపడ్డాయి. కానీ, క్రమంగా అది బీజేపీ వైపు మళ్లింది. బీజేపీ శ్రేణులు కాంగ్రెస్‌కు కౌంటర్‌గా జిలేబీలు పంచిపెట్టాయి. రాహుల్ గాంధీపై ట్రోల్స్ కూడా చేశాయి. ఓ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జిలేబీలను దేశవ్యాప్తంగా పాపులర్ చేసి అమ్ముతామని, విదేశాలకూ ఎగుమతి చేయిస్తామని చెప్పారు. తద్వార ఇలాంటి జిలేబీ షాపు ఓనర్లు ఫ్యాక్టరీ పెట్టి వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించగలరని పేర్కొన్నారు.
నాయబ్ సైనీనే సీఎం:
హర్యానాలో రెండుసార్లు మనోహర్ లాల్ ఖట్టార్ సీఎంగా కొనసాగారు. మూడోసారి ఎన్నికలకు వెళ్లడానికి 200 రోజుల ముందు సీఎంను మార్చింది బీజేపీ. మనోహర్ లాల్ ఖట్టర్‌ను కేంద్రమంత్రి చేసి ఆయన స్థానంలో ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయబ్ సింగ్ సైనీకి అవకాశం ఇచ్చింది. నాయబ్ సింగ్ బీజేపీకి వందశాతం ఉపకరించారు. మూడోసారి కూడా ప్రభుత్వ వ్యతిరేకత ముప్పు నుంచి పార్టీని గట్టెక్కించారు. ఘన విజయాన్ని పార్టీకి అందించారు. ఎన్నికలకు ముందే బీజేపీ చెప్పినట్టుగా సీఎంగా నాయబ్ సింగ్ సైనీనే కొనసాగించబోతున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ శాసనసభ్యులతో సమావేశాన్ని ఏర్పాటుచేసి బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకుని.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని త్వరలోనే గవర్నర్ బండారు దత్తాత్రేయను బీజేపీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేయనున్నారు.
వినేష్ ఫోగట్:
ఈ ఎన్నికల్లో వినేష్ ఫోగట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుమారు 6 వేల ఓట్ల మార్జిన్‌తో బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్ పై విజయం సాధించారు. సత్యం గెలిచిందని వినేష్ ఫోగట్ తన గెలుపుపై ఫస్ట్ కామెంట్ చేశారు. తాము ఎదుర్కొన్న సవాళ్లు, సమస్యలను మరే క్రీడాకారుడు ఎదుర్కోకూడదని తాను రాజకీయాల్లోకి వచ్చానని, తనను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఆయన గెలుపుపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ధర్నాలు చేసిన రెజ్లర్లు హీరోలు కాదని, జూనియర్ రెజ్లర్లందరికీ వారు విలన్లేనని పేర్కొన్నారు. ‘వినేష్ ఫోగట్ గెలవడానికి నా పేరు వాడుకుంటే నేను గ్రేట్ అనే కదా అర్థం. ఆమె గెలిచింది కానీ, కాంగ్రెస్ ఓడింది. ఆమె ఎక్కడ అడుగు పెట్టినా.. అక్కడ పతనమే ఉంటుంది’ అని విమర్శించారు.