Defence: జలాంతర్గాముల సామర్థ్యం పెంపు.. రెండు కీలక ఒప్పందాలపై రక్షణ మంత్రిత్వ శాఖ సంతకం

by vinod kumar |
Defence: జలాంతర్గాముల సామర్థ్యం పెంపు.. రెండు కీలక ఒప్పందాలపై రక్షణ మంత్రిత్వ శాఖ సంతకం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత నావికాదళానికి చెందిన జలాంతర్గాముల సామర్థ్యాలను పెంపొందించడంతోపాటు సముద్ర భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో సుమారు రూ.3,000 కోట్ల విలువైన రెండు కీలక ఒప్పందాలపై రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం సంతకాలు చేసింది. మొదటి ఒప్పందం ముంబైలోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL)తో కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ విలువ రూ. 1,990 కోట్లు కాగా.. దీని కింద డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) ప్లగ్ తయారు చేయబడుతుంది. ఇది సంప్రదాయ జలాంతర్గాములలో అమర్చబడుతుంది. ఇది జలాంతర్గాములు ఎక్కువ కాలం పాటు నీటి అడుగున ఉండి పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.

ఫ్రాన్స్‌లోని నేవల్ గ్రూప్‌తో రెండో ఒప్పందం కుదరగా దీని విలువ రూ.877 కోట్లుగా ఉంది. దీని కింద డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ హెవీ వెయిట్ టార్పెడో (EHWT) కల్వరి-తరగతి జలాంతర్గాములలో అమర్చబడుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో ఇండియన్ నేవీ, డీఆర్డీఓ, నేవల్ గ్రూప్ ఫ్రాన్స్ మధ్య సహకారం ఉంటుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో రెండు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ప్రాజెక్ట్ సాంప్రదాయ జలాంతర్గాముల బలాన్ని పెంచుతుందని ఆత్మనిర్భర్ భారత్ చొరవకు గణనీయంగా దోహదపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Next Story

Most Viewed