IND-W vs SL-W : శ్రీలంకతో జాగ్రత్త.. హర్మన్‌ప్రీత్ సేనకు తాడోపేడో

by Harish |
IND-W vs SL-W : శ్రీలంకతో జాగ్రత్త.. హర్మన్‌ప్రీత్ సేనకు తాడోపేడో
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమితో టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంలో పడ్డాయి. రెండు మ్యాచ్‌లో పుంజుకుని చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించినప్పటికీ నాకౌట్ బెర్త్‌పై సందిగ్ధం అలాగే ఉంది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో(శ్రీలంక, ఆస్ట్రేలియా) భారీ విజయాలు సాధించడం హర్మన్‌ప్రీత్ సేనకు తప్పనిసరి. ఏ ఒక్క దాంట్లో ఓడినా నాకౌట్‌కు చేరుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో భారత జట్టు శ్రీలంకతో పోరుకు సిద్ధమైంది. నేడు దుబాయ్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. రెండు మ్యాచ్‌లు కీలకమే కాబట్టి హర్మన్‌ప్రీత్ సేనకు ఈ మ్యాచ్ కూడా చావోరేవోలాంటిదే. గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. ఓడితే ప్రమాదంలో పడతాయి.

టీ20ల్లో శ్రీలంకపై తిరుగులేని రికార్డు భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు టీ20ల్లో 25సార్లు తలపడగా..19 విజయాలు భారత్‌వే. శ్రీలంక ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గగా.. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. లంక జట్టుపై ఈ రికార్డు కచ్చితంగా భారత ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం నింపేదే. అయితే, బ్యాటర్ల నిలకడలేమి భారత్‌కు సమస్యగా మారింది. భారీ అంచనాలు పెట్టుకున్న స్మృతి మంధాన రెండు మ్యాచ్‌ల్లోనూ తక్కువ స్కోరుకే అవుటైంది. ఆమె పుంజుకోవడం తప్పనిసరి.

షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తొలి మ్యాచ్‌లో తేలిపోయినా రెండో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్సే ఆడారు. వీరి నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నది. రిచా ఘోష్, దీప్తి శర్మ గత రెండు మ్యాచ్‌ల్లో అంచనాలను అందుకోలేకపోయారు. వారు కూడా ఫామ్ అందుకుంటే జట్టుకు ఢోకా ఉండదు. ఇక, బౌలింగ్ పరంగా అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రేణుక సింగ్ రాణిస్తుండటం జట్టుకు బలం. మరోవైపు, వరుసగా రెండు ఓటములతో శ్రీలంక ఢీలా పడింది. అయినప్పటికీ ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ ఏడాది ఆసియా కప్ ఫైనల్‌లో ఆ జట్టు భారత్‌ను ఓడించి టైటిల్ ఎగరేసుకపోయింది. అలాగే, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వ వంటి బ్యాటర్లతోపాటు ప్రబోధని, సుగంధిక కుమారి నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. కెప్టెన్, ఆల్‌రౌండర్ ఆటపట్టు ఆ జట్టుకు ప్రధాన బలంగా ఉన్నది. కాబట్టి, శ్రీలంకతో జాగ్రత్తగా ఉండాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed