ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు..జోరుగా సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు..

by Aamani |
ఇష్టారీతిన అక్రమ నిర్మాణాలు..జోరుగా సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు..
X

దిశ,సూర్యాపేట టౌన్ : ప్రభుత్వ నియమ నిబంధనలు తమకేమీ పట్టనట్లుగా సెల్లార్ తవ్వకాలు..అంతస్తుల నిర్మాణాలను జోరుగా చేపడుతున్నారు. కొంతమంది అనుమతులు లేకుండా సెల్లార్ తవ్వకాలు జరిపి తాత్కాలిక గోడను నిర్మించి మాకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ బుకాఇస్తున్నారు. మరి కొంతమంది అనుమతులు లేకుండానే అంతస్తు మీద అంతస్తు లేస్తూ బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. దీనికి తోడు అనుమతులు లేకుండా పెద్ద సంఖ్యలో ఫంక్షన్ హాల్స్, లాడ్జిలు, రిసార్ట్స్ లను నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తనట్లుగా వ్యవహరిస్తున్నారు. సూర్యాపేట డివిజన్ లో జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలను సంబంధిత అధికారులు కట్టుదిట్టం చేయకపోవడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ పలు మండల గ్రామాల్లో ఎక్కడ చూసిన అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఇదేమిటని అడిగే నాథుడు లేకపోవడంతో ఆరు అంతస్తులు మూడు భవనాలు అన్నట్లుగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. ఆయా గ్రామాల మున్సిపాలిటీలు విలీనం అయింది మంచిదిగా అన్నట్లుగా అక్రమార్కులు అధికారులు కుమ్మక్కై విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.

అసాంఘిక కార్యకాలపాలకు అడ్డాగా..

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని అక్రమ కట్టడాలల్లో ఫంక్షన్ హాల్స్, లాడ్జిలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీబీ గూడెం రోడ్డు, ఎన్ హెచ్ 65 ఖమ్మం బొమ్మ దగ్గర లోని ఓ బిల్డింగ్ లో లాడ్జిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్థానిక 60 రోడ్డు లో ఓ ఫంక్షన్ హాల్ లాడ్జిను ఏర్పాటు చేశారు. అలాగే కొత్త బస్టాండ్ ఎదురుగా, ఖమ్మం బొమ్మ దగ్గరలో మరొక లాడ్జ్, ఎంజీ రోడ్ లో ఓ లాడ్జి, ఇలా ఇష్టారాజ్యంగా కొన్ని అంతస్థులలో లాడ్జిలను ఫంక్షన్ హాల్స్ లను ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ హెచ్ 65 దురాజ్ పల్లి దగ్గర లో అనుమతులు లేకుండానే ఓ అంతస్తు నిర్మించారు.

భీమారం రోడ్డు లోని ఓ రిసార్ట్స్, చివ్వెంల మండలం ఉడ్రుగొండ గుట్ట దగ్గర్లో ఓ రిసార్ట్స్, పట్టణంలో కొన్ని ఫంక్షన్ హాల్స్, లాడ్జిలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కూడా మారుతున్నాయని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. లేట్ నైట్ పార్టీల లో మద్యం ఏరులై పారుతున్న సంబంధిత అధికారులు లాడ్జిల వైపు ఫంక్షన్ హాల్స్ వైపు, రిసార్ట్స్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల భారీ విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో పడి ఏం జరిగినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రిసార్ట్స్ వీకెండ్ మాత్రం గ్రూపులు గ్రూపులుగా విభజించి పార్టీలు చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించి వేల రూపాయల అద్దె వసూలు చేస్తున్నారు కానీ ఇందులో ప్రభుత్వానికి మాత్రం ఒక్క పైసా కూడా పనులు చెల్లించకపోవడం గమానార్హం.

బిల్ కలెక్టర్ల కనుసన్నల్లోనే..

సూర్యాపేట డివిజన్ పరిధిలో మున్సిపాలిటీ,కొన్ని విలీన గ్రామ పంచాయతీ ల పరిస్థితి మరీ దారుణం. కార్యాలయం మొత్తం బిల్ కలెక్టర్ల కనుసన్న లోనే పనులు జరుగుతున్నాయని వారు చెప్పింది అక్కడ వేదం అన్నట్టుగా వార్డు కార్యాలయ అధికారుల పని తీరు ఉంటుందంటే అతిశయోక్తి లేదు. అదే ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు బిల్లు కలెక్టర్లను తమ గుప్పిట్లో పెట్టుకుని అక్రమంగా అనుమతులు తీసుకుని ఇష్టానుసారంగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. గ్రామంలో, మున్సిపాలిటీలో పలుకుబడి ఉన్న వ్యక్తులు నిర్మాణాలు చేపడుతున్నారని ఆయా నిర్మాణాలపై చర్యలు తీసుకోలేమని సంబంధిత అధికారులు వివరణ ఇస్తుండడం చర్చనీయాంశమైంది. అలాగే జిల్లా కేంద్రంలోని కుడ కుడ రోడ్డు లోని ఓ అంతస్తూ సెల్లర్ విషయంపై స్థానిక సంబంధిత ఉద్యోగిని వివరణ అడగ్గా తమకే సంబంధం లేదని అంత కార్యాలయంలో ఉన్న ఓ అధికారి చూసుకుంటున్నారు అంటూ సమాధానం దాటవేశారు.

సమస్యల పరిష్కారంలో విఫలం..

సూర్యాపేట మున్సిపాలిటీ, పలు గ్రామాల్లో ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇప్పటివరకు ఒక్కసారి కూడా అక్రమ నిర్మాణ దారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత గ్రామలల్లో పరిపాలన వ్యవస్థ గాడి తప్పిందని సమస్యలు పరిష్కరించడంలో జిల్లా మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై లాడ్జి ల పై, ఫంక్షన్ హాల్స్ పై రిసార్ట్స్ లపై చర్యలు తీసుకుని కట్టడి చేయాలని జిల్లా ప్రజానీకం కోరుకుంటుంది.

పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం..: శ్రీనివాస్ కమిషనర్,సూర్యాపేట మున్సిపాలిటీ

సూర్యాపేట పట్టణంలో అనుమతులు లేకుండా సెల్లార్లు నిర్మిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. అలాగే అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ గృహాలను నిర్మించేటప్పుడు కచ్చితంగా మున్సిపాలిటీ అనుమతులు తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed