- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్, ఎన్సీ కూటమిదే జమ్ముకాశ్మీర్ ‘పీఠం’.. సీఎంగా ఒమర్ అబ్దుల్లా!
దిశ, నేషనల్ బ్యూరో : జమ్ముకాశ్మీర్-2024 అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, సీపీఐ(ఎం) కూటమి విజయం సాధించింది. ఎన్సీ కూటమి మొత్తంగా 49 స్థానాలను కైవసం చేసుకుంది. జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. మంగళవారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) విడుదల చేసిన ఫలితాల్లో్ జమ్ముకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేన్) పార్టీ సొంతంగా 42 స్థానాలు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 29 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక జాతీయ పార్టీ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సీ) కేవలం 6 స్థానాలతో 3వ స్థానంలో నిలువగా.. ఆ తర్వాత జమ్ముకాశ్మీర్ పీపుల్స్ డెమెుక్రటిక్ పార్టీ (జేకే పీడీపీ) 3 స్థానాలను కైవసం చేసుకుంది. మిగతా పార్టీల పరంగా చూస్తే జమ్ముకాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ -1, సీపీఐ(ఎం)-1, ఆమ్‌ఆద్మీ పార్టీ -1, స్వతంత్రులు -7 స్థానాల్లో గెలుపొందారు.
పదేళ్ల తర్వాత ఎన్నికలు..
జమ్ముకాశ్మీర్‌లో 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370, అధికరణ 35Aను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం జమ్ముకాశ్మీర్‌ను రెండుగా విభజించి జమ్ముకాశ్మీర్, లఢక్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా గుర్తించింది. దాదాపు 10ఏళ్ల తర్వాత జమ్ముకాశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీ,సీపీఐ(ఎం) పార్టీలు పొత్తు పెట్టుకోగా.. బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఇక మాజీ సీఎం, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ సైతం ఒంటరిగా ఎన్నికల బరిలో దిగింది. తీరా నేడు (మంగళవారం) ఫలితాలు వెలువడగా.. ఒమర్ అబ్దుల్లా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.
ఆర్టికల్ 370, రాష్ట్ర హోదా పునరుద్ధరణ..
జమ్ముకాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారంలోకి వచ్చేందుకు ప్రధానంగా ఆర్టికల్ 370, రాష్ట్ర హోదా పునరుద్ధరణ డిమాండ్ ఈ రెండు పార్టీలకు బాగా సాయపడిందని చెప్పుకోవచ్చు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌లో ఐదేళ్ల పాటు లెఫ్టినెంట్ గవర్నర్ పాలన కొనసాగింది. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడినట్లు స్థానికుల నుంచి వచ్చిన ప్రధాన ఆరోపణ. దీంతో తమ ప్రాంతంపై సర్వహక్కులు తమకే దక్కాలనే డిమాండుతో జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370ని తిరిగి పునరుద్ధరించాలని ఒమర్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన అజెండాగా ఎన్నికల బరిలో దిగింది. తమకు అధికారం కల్పిస్తే ఆ రెండింటినీ సాధిస్తామనే డిమాండును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇక ఎన్సీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ మాత్రం కేవలం రాష్ట్ర హోదా పునరుద్ధరణ గురించి మాత్రమే ప్రస్తావించగా.. ఆర్టికల్ 370ని తిరిగి పునరుద్ధరించాలని ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అందుకే కాంగ్రెస్‌కు కేవలం 6 సీట్లు రాగా, ఎన్సీకి 42 సీట్లు దక్కాయి. దీన్ని బట్టి స్పెషల్ స్టేటస్‌ను జమ్మూ ప్రజలు కోరుకుంటున్నట్లు మరోసారి స్పష్టమైంది.
బీజేపీకి మెజార్టీ సీట్లు దక్కినా..
కేంద్రంలోని బీజేపీ పార్టీకి జమ్ముకాశ్మీర్ ప్రజలు షాకిచ్చారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాద చర్యలపై ఉక్కుపాదం, టూరిజం డెవలప్మెంట్, కాశ్మీరీ పండింట్లకు తిరిగి పునరావాసం, జమ్ముకాశ్మీర్ అభివృద్ధికి స్పెషల్ ప్యాకెజ్, బాంబు పేలుళ్లు, రాళ్లు రువ్వడం వంటి హింసాత్మక ఘటనలు లేని జమ్మును తయారు చేశామని, ఇక ముందు కూడా రాష్ట్రాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దుతామని ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా కశ్మీర్ ప్రజలకు భరోసానిచ్చారు. అయినప్పటికీ అక్కడి ప్రజలు బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయినా రెండో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది.
2014లో సీఎంగా ముఫ్తీ.. ఇప్పుడు!
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 87 స్థానాలకు గాను బీజేపీ 25, పీడీపీ 28, ఎన్సీ 15 సీట్లు, కాంగ్రెస్ 12, జేకే పీపుల్ కాన్ఫరెన్స్ 2, సీపీఐ(ఎం) 1, స్వతంత్రులు 3, జేకే పీపుల్ డెమెక్రటిక్ ఫ్రంట్ (సెక్యులర్) 1 స్థానాలను గెలుచుకోగా.. ఆనాడు మెహబూబా ముఫ్తీ (పీడీపీ) బీజేపీ పార్టీతో పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా మెహబూబాముఫ్తీ ప్రమాణం చేశారు. నాలుగేళ్ల తర్వాత 2018లో పీడీపీకి మద్దతును బీజేపీ ఉపసంహరించుకోవడంతో జమ్ముకాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత 2019లో ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం.. తీరా పదేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ అభ్యర్థులు ఘోరపరాజయం పాలయ్యారు. కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇదిలాఉండగా, మాజీ సీఎం ముఫ్తీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండగా.. ఆమె కూతురు ఇల్తీజా ముఫ్తీ (శ్రీగుఫ్వారా - బిజ్బెహర) నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప (ఎన్సీ) పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా వీరి చేతిలో 9,770 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇదిలాఉండగా, డీమిలిటేషన్ ప్రక్రియలో భాగంగా జమ్ములో 87అసెంబ్లీ స్థానాలను 90కు కేంద్రం పెంచిన విషయం తెలిసిందే.
ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్..
ఓట్ షేర్ పరంగా చూసుకుంటే బీజేపీ ఈ ఎన్నికల్లో అధికంగా కొల్లగొట్టింది. 2014లో సాధించిన దానికంటే ఈసారి 2.65 శాతం ఎక్కువ నమోదుచేసింది. 2024 ఎన్నికల్లో మొత్తంగా 25.63 శాతం ఓట్ షేర్ క్లెయిమ్ చేసింది.ఇక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 23.44 శాతంతో ఓట్ షేర్‌తో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 11.97 శాతంతో సరిపెట్టుకుంది. NCకి గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 2.67 శాతం ఎక్కువ సాధించింది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే దాని మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ వాటా 6 శాతం క్షీణించింది. ఇక పీడీపీకి ఈసారి 8.87 శాతం ఓట్లు రాగా.. 2014తో పోలిస్తే 13.8 శాతం తక్కువ నమోదు చేసింది.
సీఎంగా ఒమర్ అబ్దుల్లా..
ఈ ఎన్నికల్లో బుద్గాం, గందర్‌బల్ సెగ్మెంట్ల నుంచి పోటీ చేసిన ఒమర్ అబ్దుల్లా రెండు స్థానాల్లోనూ గెలుపొందాడు. దీనికి తోడు ఆ పార్టీ 42 స్థానాల్లో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో ఒమర్ అబ్దుల్లా జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి అవుతాడని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.
J&K లో ప్రజాస్వామ్యం ప్రబలింది : ఒమర్ అబ్దుల్లా
చాలా కాలం తర్వాత J&K లో ప్రజాస్వామ్యం ప్రబలింది. ప్రజలు తమ తీర్పును ప్రకటించారు. నేషనల్ కాన్ఫరెన్స్‌కు పట్టం కట్టారు. ప్రజాతీర్పును గౌరవించాలి. ఈసారి బీజేపీ ఎటువంటి కుయుక్తులకు పాల్పడొద్దు.