ప్రజలపై భారం మోపకుండా ఉచితంగా ఎల్​ఆర్​ఎస్​ను అమలు చేయాలి

by Sridhar Babu |
ప్రజలపై భారం మోపకుండా ఉచితంగా ఎల్​ఆర్​ఎస్​ను అమలు చేయాలి
X

దిశ, బాల్కొండ : ప్రజలపై భారం మోపకుండా ఉచితంగా ఎల్​ఆర్​ఎస్​ను అమలు చేయాలి అని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల మంది ఎల్​ఆర్​ఎస్ లబ్దిదారులపై సుమారు 20 వేల కోట్ల భారం మోపేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బాల్కొండ నియోజకవర్గంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిందన్నారు. మూడు నెలలు అయినా రైతులకు ఇంకా రైతు బంధు పడలేదని,

మహాలక్ష్మి ఊసేలేదని, చేయూత పెన్షన్ మరిచిపోయారన్నారు. కాంగ్రెస్ అమలు చేసింది ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే అన్నారు. కేసీఆర్ ను బీఆర్ ఎస్ పార్టీని బొంద పెడతా అంటున్న రేవంత్ రెడ్డిని హామీలు అమలు చేయకుంటే ప్రజలే బొంద పెడతారన్నారు. ఉచితంగానే ఎల్​ఆర్​ఎస్ ను వర్తింపజేసేవరకు పోరాటం ఆపేది లేదన్నారు. లేదా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్క ,కోమటి రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజీనామా చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి వినతిప్రతం అందించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed