- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తరుగు పేరిట దోపిడీ.. మంత్రి హెచ్చరించినా ఆగని కడ్తా కటింగ్
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆరుగాలం కష్టించి వరి ధాన్యాన్ని పండించిన అన్నదాతలను ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అడ్డగోలుగా దోచేస్తున్నాయి. కడ్తా, హమాలీ ఖర్చుల పేరుతో ఇష్టారీతిన దోచేస్తున్నారు. అన్యాయమంటూ ప్రశ్నించిన రైతులు ధాన్యాన్ని కాంటా వేయకుండా రోజుల తరబడి కేంద్రాల్లోనే ఉంచి చుక్కలు చూపిస్తున్నారు. వారి ముందు తగ్గిపోయి తరుగుకే అమ్ముకోవాల్సి వస్తోంది. పంట చేతికి రాగానే సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జరిగిన ఆలస్యం కారణంగా దళారులు రైతులను దోచేశారు. ఇప్పుడు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా మద్దతు ధర ఒక్కటి మినహా తూకం విషయంలో నిండా మోసం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన మాదిరిగా ఇక్కడ ఏం జరగదని, ఇక్కడి బాధలు ఇక్కడే ఉంటాయి.. అవన్నీ సర్కార్, కలెక్టర్లకు ఏం తెలుసని రైతులకు కేంద్రాల నిర్వాహకులు సూక్తులు చెపుతుండటం గమనార్హం. కేంద్రాల నిర్వాహకులు ఇష్టారీతిలో తరుగు పేరుతో, హమాలీ పేరుతో రైతులను అడ్డంగా దోచేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన రైతులు ధాన్యాన్ని కాంటా వేయకుండా రోజుల తరబడి కేంద్రాల్లోనే నిలిపేస్తున్నారు.
క్వింటాకు 5.50 కిలోల తరుగు దోపిడీ
ఒక్కో బస్తాలో 40 కిలోల 600 గ్రాముల ధాన్యం తూకం వేయాలని అధికారుల ఆదేశాలున్నాయి. కానీ, కేంద్రాల్లో ఒక్కో బస్తాలో 42 కిలోల 625 గ్రాముల ధాన్యం తూకం వేస్తున్నారు. ఇది ఉమ్మడి జిల్లాలో ఒక్కో చోట ఒకలా ఉన్నప్పటికీ తూకంలో పెద్దగా వ్యత్యాసం లేదు. బస్తాకు 2 కిలోల 250 గ్రాములు అదనంగా తూకం వేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో క్వింటాకు రైతును తరుగు పేరుతో 5 కిలోల నుంచి 5 కిలోలన్నర వరకు దోచేస్తున్నారు. దాదాపు క్వింటాకు దాదాపు రైతులు రూ.125లు నష్టపోతున్నారు. వంద క్వింటాళ్ల ధాన్యాన్ని తూకం వేసిన రైతు నికరంగా రూ.12,500 లకు పైగా నష్టపోతున్నాడు. ఒక్కో బస్తాను తూకం వేసి, లారీలో ఎక్కించడానికి రైతులు హమాలీలకు బస్తాకు ఒక రూపాయి చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇది కాకుండా క్వింటాకు హమాలీ చార్జీలు రూ.35 లు రైతులే చెల్లిస్తున్నారు. ఒక్కో రైతు ఇంత జరుగుతున్నా అధికారులు తెలిసీతెలియనట్లు వ్యవహరించడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కనిపించని తాగునీటి సౌకర్యం..
ప్రతి కొనుగోలు సెంటర్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశాలున్నా కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వంటి ఉన్నతాధికారులు కొనుగోలు సెంటర్లను సందర్శించినపుడు ఇబ్బందులు, సమస్యలను గురించి అడిగినపుడు అంతా బాగానే ఉందని చెప్పాలని రైతులకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సూచిస్తున్నారు. ఒకవేళ కేంద్రాల్లో సమస్యలు, లోపాలపై అధికారులకు ఫిర్యాదులు చేస్తే ధాన్యం కాంటా వేసేటప్పుడు కొర్రీలు పెడతామని ఓపెన్‌గా హెచ్చరిస్తున్నట్లు పలువురు రైతులు తెలిపారు. దీంతో ఎందుకొచ్చిన గొడవంటూ అధికారులు అడిగినపుడు అంతా బాగానే ఉందని చెప్పాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. గంటల తరబడి ఎండలో పనిచేస్తుంటే దాహం వేసి నీళ్లు తాగుదామన్నా కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు అందుబాటులో ఉంచడం లేదని రైతులు వాపోతున్నారు. సన్న వడ్ల సంచులపై ఎస్ మార్కులు కూడా రైతులతోనే వేయిస్తున్నారు. కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని కాంటాచేయించుకోవాలంటే కూడా నిర్వాహకులను ముందుగానే బయట మేనేజ్ చేసుకోవాల్సి వస్తోందని, ట్రీట్ ఇవ్వాల్సి వస్తోందని కొందరంటున్నారు.లేదంటే వడ్లు కాంటా వేయడానికి ఏవేవో కారణాలు చెప్పి కనీసంమూడు రోజులైనా ఆలస్యం చేస్తారని రైతులంటున్నారు.
కొద్దిరోజుల క్రితం ఎంపీఅర్వింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తలు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించినపుడు కేంద్రాల్లో జరుగుతున్న మోసాలపై కూడా మాట్లాడారు. రైతులను మోసంచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈనెల 13న జిల్లాలో రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన అధికారులతో నిర్వహించిన సమావేశంలో కడ్తాపేరుతో దోపిడీచేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.కొనుగోలు కేంద్రాల్లో కడ్తా పేరుతో రైతులను మోసం చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అయినప్పటికీ పరిస్థితులో మార్పు రాలేదు.కొనుగోలు కేంద్రాల్లో ఎన్నో యేళ్లుగా పాతుకుపోయిన కడ్తా దోపిడీని అరికట్టే సామర్థ్యం ఉన్నతాధికారులకు లేక వదిలేస్తున్నారా? లేదంటే ఉన్నతాధికారులకు ఇదంతా తెలిసే జరుగుతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.దీనిపై ఉన్నతాధికారులు స్పందించాల్సిఉంది..కడ్తా పేరుతో జరుగుతున్న దోపిడీని సమర్థంగా అరికట్టాల్సిఉంది.