అనాథలం అనే భావనను వీడి బాగా చదువుకోవాలి

by Sridhar Babu |
అనాథలం అనే భావనను వీడి బాగా చదువుకోవాలి
X

దిశ, నిజామాబాద్ సిటీ : భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల బాలసదన్ లో చిన్నారులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి తదితరులు హాజరై విద్యార్థినులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. చిన్నారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాము అనాథలము అనే భావనను విడనాడి, చక్కగా చదువుకోవాలని బాలసదన్ చిన్నారులకు హితవు పలికారు. మాకు ఎవరూ లేరు... మేము ఒంటరి వారిమనే ఆలోచనను దరి చేరనివ్వొద్దని సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యతోనే చక్కటి భవిష్యత్తు లభిస్తుందని, క్రీడల్లోనూ ఆసక్తిని పెంపొందించుకోవాలని ఉద్బోధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకుండా, ఎలాంటి సమస్య ఎదురైనా టీచర్ల దృష్టికి తేవాలని సూచించారు. మీకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా కల్పించారు. సదన్ లోని బాలలను సిబ్బంది తమ సొంత బిడ్డలుగా చూసుకుంటూ వారి అభ్యున్నతికి పాటుపడుతుండడం

వల్ల పలువురు ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు చదువుతున్నారని అన్నారు. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కలెక్టర్, ఎస్ పీ, డాక్టర్, ఇంజనీర్ లుగా రాణించాలని పిలుపునిచ్చారు. ఇతరులపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడి ఇతరులకు ఆదర్శంగా మారాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎస్.జయరాం, ట్రైనీ ఐపీఎస్ చైతన్య, డీడబ్ల్యూఓ రసూల్ బీ, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, బాలసదన్ పర్యవేక్షకురాలు వినోద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed