దొరల తెలంగాణను తరిమి కొట్టండి.. రాహుల్ గాంధీ

by Sumithra |
దొరల తెలంగాణను తరిమి కొట్టండి.. రాహుల్ గాంధీ
X

దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలో దొరల తెలంగాణను తరిమి కొట్టి.. ప్రజా తెలంగాణ కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీ అయిన కాంగ్రెస్ చేయి గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో శుక్రవారం స్ట్రీట్ కార్నర్ సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అశేషంగా హాజరైన జనవాహిని ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని తీర్చేందుకు తలుపులు తెరిచి ఉంటాయన్నారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ ప్రజలను కల్వకుండ ప్రగతి భవన్ లో ఉంటున్నారని, సమస్యల పై కలిసేందుకు ప్రజలు ప్రగతి భవన్ కు వెళ్లిన వారినిలోనికి రానివ్వడం లేదన్నారు.

2004 కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలుసుకొని ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. ఇందిరా గాంధీ హయాంలో పేదలకు వ్యవసాయ భూములు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందన్నారు. తమ కుటుంబం ప్రజలతో ప్రేమానురాగాలు, సత్సంబంధాల కోసం పాటు పడుతుందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ కుటుంబ పాలన చేస్తు రాష్ట్రంలోని సహజ వనరులన్నీ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ధరలు పెరిగి ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను, నాలుగు రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించి అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో భూములు, ఇసుక దందాతో పాటు అనేక అక్రమాలకు పాల్పడుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆయన కుటుంబం చేసిన లూటీ డబ్బును తెలంగాణ ప్రజల కోసం వెనక్కి రప్పిస్తానని రాహుల్ గాంధీ అన్నారు.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరు కుంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు పథకాలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పసుపు రైతులకు ఇచ్చిన హామీని ఐదేళ్ల కాలయాపన చేసి, ఎన్నికల నేపథ్యంలో తూతూ మంత్రంగా ప్రకటన చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పసుపును క్వింటాలుకు 12 నుంచి 15 వేల రూపాయలకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణాలు, రూ.500 కే గ్యాస్ సిలిండర్ ప్రతి మహిళకు రూ. 2500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతి నెల రూ. 4000 పింఛన్ ఇస్తామన్నారు.

రైతన్నకి మద్దతు ధరలతో పాటు పంటల దిగుబడుల పై క్వింటాల్ కు 500 బోనస్ను ఇస్తామన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజలందరూ చేతి గుర్తుకు ఓటు వేసి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ లో సునీల్ రెడ్డి, బోధన్ లో సుదర్శన్ రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ సమావేశ సభకు అశేషం గా హాజరైన జనానికి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలను రాహుల్ గాంధీ చేతులెత్తి పరిచయం చేయించి అభివాదం చేశారు. ఈ సభలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్ ఠాకూర్, పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ , మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కి గౌడ్, టీపీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ దేగాం ప్రమోద్, టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యుడు కోల వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు సాయి బాబా గౌడ్, మండల అధ్యక్షుడు చేపూర్ చిన్నారెడ్డి, సీనియర్ నాయకులు మార చంద్రమోహన్ , యాల్ల సాయి రెడ్డి, పుట్టింటి చుక్క శ్రీనివాస్ రెడ్డి,వివిధ జిల్లాల నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరిక...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా నాయక్ శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ను రాహుల్ గాంధీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే భర్త గతంలోనే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇదివరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆ పార్టీకి గుడి పై చెప్పి శుక్రవారం చేయి పార్టీతో నడిచేందుకు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలోనే బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనలో ఖానాపూర్ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న రేఖానాయక్ ను కాదని మంత్రి కేటీఆర్ సన్నిహితుడైన మరో వ్యక్తికి కేటాయించడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది.

Advertisement

Next Story

Most Viewed